ఇంటి పెరటిలో రెండు మేకలు ఉన్నాయంటే ఆ కుటుంబానికి ఎంతో భరోసా. కానీ అదే ఇంట్లో పిల్లాడి చదువు ఆ కుటుంబానికి భవిష్యత్. ఈ రెండింటిలో ఏది కావాలంటే మాత్రం రెండోదే అంటారు ఎలాంటి ఫ్యామిలీ అయినా. సర్విళాదేవి కూడా అదే చేశారు. కానీ ఆమె అంచనా తప్పింది. 


బిహార్‌లోని నవడా జిల్లా థాల్పాస్‌ గ్రామంలో ఉంటున్నారు సర్విళా దేవి. ఆమె భర్త ఎప్పుడో కాలం చేశాడు. కూలీపనులు చేసుకుంటూ ఉన్న ఒక్కగానొక్క కుమారుడు 19 ఏళ్ల గుల్షన్ చదివిస్తోంది. 


తన చదువు కోసం మొబైల్ అవసరం ఉందని తల్లికి చెప్పాడు గుల్షన్. కుమారుడి చదువుకుంటే భవిష్యత్ బాగుంటుందని ఆలోచించింది సర్విళాదేవి. తన పెరటిలో ఉన్న రెండు మేకలను అమ్మేసింది.  వచ్చిన ఆరువేల రూపాయలను కుమారుడు గుల్షన్‌కు ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకున్న గుల్షన్... తాను సెల్‌ ఫోన్ కొనుక్కొని ఆ సెల్‌ఫోన్ ద్వారా మంచిగా చదువుకుంటానని మాట ఇచ్చాడు. 


సెల్‌ఫోన్ కొన్న నెల రోజులకే గుల్షన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఏం జరిగిందో తెలియక ఆ తల్లి సర్విళా దేవి కంగారు పడింది. పోలీసులను ప్రాధేయపడి అడిగితే అసలు విషయం చెప్పారు. తన కుమారుడి అసలు స్వరూపం తెలిసి ఒక్కసారిగా కుంగిపోయిందా తల్లి. 


మేకలు అమ్మి తల్లి ఇచ్చిన డబ్బుతో సెల్‌ఫోన్ కొన్న గుల్షన్ దాన్ని ఎప్పుడూ ఆన్‌లైన్‌ తరగతుల కోసం వాడలేదు. ఆ సెల్‌ ఫోన్‌ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించాడు. ఆ ఊరి కుర్రాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. అప్పటికే ఆ ఊరిలో కుర్రాళ్లు అదే పనిలో ఉన్నారు. ఈజీ మనీ కోసం ఇలా అడ్డదారులు తొక్కారు. అందులో గుల్షన్ కూడా మునిగిపోయాడు. 


ఫిబ్రవరి 15న పోలీసులు నిర్వహించిన దాడుల్లో 33 మంది చిక్కారు. వీళ్లంతా 14 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లే. ఇందులో 31 మంది థోల్పోస్‌ గ్రామానికి చెందిన వారే. 


అరెస్టు అయిన చాలా మందికి పేద కుటుంబాలకు చెందిన వారే . అప్పులు చేసి సెల్‌ఫోన్లు కొనుక్కోవడం.. వాటితో మోసాలకు పాల్పడటం వీళ్లు వృత్తిగా మార్చుకున్నారు. ఓటీపీ నేరాల నుంచి నకిలీ ఫోన్ కాల్స్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం అన్ని నేరాల్లో వీళ్ల హస్తం ఉంది. ఉన్నత చదువు, ఆన్‌లైన్‌ మోసాలపై నాలెడ్జ్ పెంచుకొని ఈ నేరాలకు పాల్పడుతున్నారు. 


ఈ ఊరిలో ఎక్కడ చూసిన సెల్‌ఫోన్ పట్టుకున్న కుర్రాళ్లే కనిపించేవారట. ఇది చూసిన పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అరెస్టైన వారు చాలా మంది బెయిల్‌పై తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఇలా నేరాలకు పాల్పడిన గుల్షన్ చదువుల్లో టాపర్. టెన్త్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. సీఎం బాలక్‌ బాలికా ప్రోత్సాహన్‌ యోజన కింద పది వేల రూపాయల స్కాలర్‌ షిప్‌ కూడా అందుకున్నాడు. గ్రామంలోని పిల్లలకు ట్యూషన్ చెబుతూ నెలకు మూడు వేల రూపాయలు సంపాదించేవాడు. వాటితోనే తల్లిని, తమ్ముడిని పోషించేవాడు. కానీ అలాంటి విద్యార్థి జీవితాన్ని సెల్‌ఫోన్ నాశనం చేసింది. ఈజీ మనీ కోసం స్నేహితుల మాటలు నమ్మి ఇలా కటకటాల పాలయ్యాడు.