Hijab Row: విద్యార్థుల నుంచి టీచర్లకు చేరిన హిజాబ్ వివాదం- ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ABP Desam   |  Murali Krishna   |  04 Apr 2022 05:35 PM (IST)

విద్యార్థుల మధ్య మొదలైన హిజాబ్ వివాదం చివరికి టీచర్ల వరకు చేరింది. హిజాబ్ ధరించిన టీచర్లను ఎగ్జామ్ హాల్స్‌లోకి అనుమతించరాదని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

విద్యార్థుల నుంచి టీచర్ల చేరిన హిజాబ్ వివాదం- ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు. అయితే చాలామంది ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా హిజాబ్‌కు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది కర్ణాటక ప్రభుత్వం. పరీక్షలకు హాజరయ్యే టీచర్లు హిజాబ్ ధరించకూడదని సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.

లేకపోతే

ప్రస్తుతం రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఇన్విజిలేషన్‌కు వెళ్లే టీచర్లు కూడా హిజాబ్ ధరించకూడదని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ధరిస్తే వారిని అనుమతించరాదని తేల్చిచెప్పింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యా సంస్థల్లో విద్యార్థులకు యూనిఫాం తప్పనిసరి. ఇదే నిబంధన టీచర్లకు కూడా వర్తిస్తుంది. పదవ తరగతి పరీక్ష హాలులోకి హిజాబ్ ధరించిన టీచర్లకు అనుమతి లేదు. ఇది 12 తరగతి వరకు నిర్వహించే పరీక్షలకు కూడా వర్తిస్తుంది. హిజాబ్‌పై మేం టీచర్లను బలవంతం చేయడం లేదు. నచ్చనివాళ్లు పరీక్ష డ్యూటీని వదులుకుంటారు.                                    -  కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్

హైకోర్టు తీర్పు

కొన్ని నెలలకు ముందు కర్ణాటకలో మొదలైన హిజాబ్​ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్​ ధరించడంపై నిషేధాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.

ఇస్లాం మతవిశ్వాసాల ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్​ ధరించడం తప్పనిసరి కాదని మేం విశ్వసిస్తున్నాం. దీనినే పరిగణనలోకి తీసుకుంటున్నాం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని చెప్పడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం కాదు. అది సహేతుకమైన పరిమితి.యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్. దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాలి                                           
 
  "
 -కర్ణాటక హైకోర్టు
 
 
Published at: 04 Apr 2022 05:28 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.