సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు.. ఎప్పుడు సెలబ్రెటీలు అయిపోతారో తెలియడం లేదు. ఇటీవల అలానే సోషల్ మీడియాను షేక్ చేసిన వీడియోలు చాలా వచ్చాయి. అయితే తాజాగా ఓ జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.


ఎక్కడ?






కేరళలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్ అయ్యర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహాత్మా గాంధీ యూనివర్శిటీ ఆర్ట్ ఫెస్టివల్ సందర్భంగా పతనంతిట్ట జిల్లా స్టేడియంలో కళాశాల విద్యార్థులు ఫ్లాష్ మాబ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ దివ్య ఎస్ అయ్యర్‌ హాజరయ్యారు. 


అయితే ఆ కార్యక్రమం జరుగుతుండగా కొందరు విద్యార్థులు తమతో పాటు డ్యాన్స్ చేయమని కలెక్టర్‌ను ఆమెను కోరారు. దీంతో విద్యార్థులతో పాటు కలెక్టర్‌ డ్యాన్స్ చేశారు. విద్యార్థులతో కలిసి పుల్‌ జోష్‌తో ఆమె కూడా డ్యాన్స్ చేశారు. అయితే ఆమె డ్యాన్స్ చూసి అక్కడున్న విద్యార్థులతో పాటు అధికారులు కూడా షాక్ అయ్యారు. ఆమె డ్యాన్స్‌లో జోష్‌తో పాటు ఫుల్ గ్రేస్ కూడా ఉంది. ఈ వీడియో నెటిజన్లను కూడా బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


కేరళ రికార్డ్


దేశంలోనే అక్షరాస్యతలో ముందుండే కేరళ ఇటీవల మరో ఘనత సాధించింది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పినరయి విజయన్ సర్కార్ తన మార్క్ పాలనను మరోసారి చాటిచెప్పింది.


కేరళ ప్రభుత్వం తొలిసారి మెజారిటీ జిల్లాలకు కలెక్టర్లుగా మహిళా అధికారులను నియమించింది. మొత్తం 14 జిల్లాలకు గానూ 10 జిల్లాలకు మహిళలనే పాలనాధికారులుగా ఎంపిక చేసింది. గతేడాది కాసర్​గోడ్ జిల్లా చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మహిళా ఐఏఎస్ అధికారి కలెక్టర్​ పగ్గాలు చేపట్టారు. 


రికార్డ్


అలప్పుజ జిల్లా కలెక్టర్​గా డా. రేణురాజ్​ను ఇటీవల నియమించడం వల్ల​ రాష్ట్ర పాలన యంత్రాంగంలో కొత్త చరిత్ర సృష్టించింది కేరళ ప్రభుత్వం. రేణురాజ్​ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మహిళా జిల్లా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది. 


రేణురాజ్​ కంటే ముందే కేరళలో 9 జిల్లాల్లో మహిళా పాలనాధికారులున్నారు. రాష్ట్ర పరిపాలన చరిత్రలోనే ఇది రికార్డు. వీరిలో దివ్య ఎస్ అయ్యర్ ఒకరు. 


కేరళ ప్రభుత్వం కూడా వారి ప్రతిభను గుర్తించింది. రెవెన్యూ డే సెలబ్రేషన్స్​ సందర్భంగా అందించిన మూడు ఉత్తమ జిల్లా కలెక్టర్ల అవార్డులు మహిళా పాలనాధికారులకే దక్కాయి. కొవిడ్ సంక్షోభం వేళ, వరదలు వచ్చిన సమయంలో మహిళా పాలనాధికారులు పనిచేసిన విధానం అమోఘం. ముఖ్యంగా వరదల సమయంలో క్షేత్రస్థాయికి వెళ్లి వారు పరిస్థితులను అంచనా వేసి.. తగిన చర్యలు చేపట్టారు ఈ మహిళామణులు.


Also Rea‌d: Road Trip: వేసవిలో రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే లొకేషన్లు ఇవిగో, ఈ దారుల్లో రోడ్ ట్రిప్ గుర్తుండిపోతుంది



Also Read: Piyush Goyal Privilege Notice : కేంద్ర మంత్రికి ప్రివిలేజ్ నోటీస్, సభను తప్పుదోవ పట్టించారని టీఆర్ఎస్ ఆరోపణ