Mother Killed Her Daughter In Jharkhand: నవ మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లే ఆ చిన్నారి పాలిట మృత్యుపాశమైంది. మూఢ విశ్వాసంతో అతి కిరాతకంగా హత్య చేసింది. చిన్నారి గుండె చీల్చి, శరీరంపై కత్తితో గాట్లు పెట్టి ఛిద్రం చేసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో (Jharkhand) చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలామూ జిల్లా ఖరద్ గ్రామానికి చెందిన అరుణ్ రామ్, గీతాదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంతోషంగా సాగిపోతోన్న వీరి జీవితంలో మూఢ విశ్వాసాలు కలకలం రేపాయి. తాంత్రిక విద్యలు నేర్చుకున్న తల్లి తన బిడ్డను మళ్లీ బతికిస్తాననే ఉద్దేశంతో కిరాతకంగా చంపేసింది. ఈ నెల 13న గీతాదేవి అత్త కౌసల్యాదేవి ధాన్యం నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వెళ్లింది. తనతో పాటు రమ్మని గీతాదేవిని కోరగా.. ఆమె తన చిన్న కుమార్తెతో కలిసి జాప్లా (హుస్సేనాబాద్) వెళ్తానని చెప్పింది. అర్ధరాత్రి దాటినా వీరు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకపోయింది.


సన్నిహితుల ఇంటికి వెళ్లి..


గురువారం వేకువజామున 2 గంటల సమయంలో గీతాదేవి అదే గ్రామానికి చెందిన మనోజ్ రామ్ ఇంటి తలుపు తట్టింది. అయితే, ఆమె భర్తతో గొడవ పడి తమ ఇంటికి వచ్చిందని మనోజ్ కుటుంబసభ్యులు భావించారు. ఈ క్రమంలోనే గీతాదేవి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని గీతాదేవి అత్త పాప ఏదని ఆమెను నిలదీసింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుస్సేనాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. 


చిన్నారి గుండెను కోసి..


చిన్నారి ఛాతీని చీల్చి శరీరంపై కత్తి గాట్లు కనిపించాయి. సమీపంలో కాలిపోయిన బట్టలు, గాజులు, కుంకుమ కనిపించాయి. దీంతో పోలీసులు చిన్నారిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. తానే చిన్నారిని హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. తాను తాంత్రిక విద్య నేర్చుకుంటున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. కుమార్తెను హత్య చేశానని.. అలా వదిలేస్తే మర్నాడు మళ్లీ తానే మంత్ర శక్తులతో తన బిడ్డను బతికించేదాన్నని పేర్కొంది. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. చిన్నారిని బలి ఇచ్చిన అనంతరం ఆమె ఆ స్థలంలో నగ్నంగా నృత్యం చేసినట్లు తెలుస్తోంది. తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆమె ఇలా చేసినట్లు సమాచారం.


'నా భార్య మానసిక రోగి కాదు'


అయితే, ఘటన జరిగిన రోజు గీతాదేవి భర్త అరుణ్ రామ్ ఇంట్లో లేడు. ఛత్ పండుగకు వచ్చిన సోదరిని అత్తవారింటి వద్ద దిగబెట్టేందుకు వెళ్లాడు. తన కుమార్తెను భార్యే చంపేసిందన్న విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. తన భార్యకు మానసిక సమస్యలేవీ లేవని.. ఆమె ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదని వాపోయాడు. తమకు పెళ్లైన మూడేళ్ల వరకూ సంతానం లేదని.. ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లిన తర్వాతే తమకు సంతానం కలిగిందని చెప్పాడు.


Also Read: Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!