Key Facts In Jhansi Hospital Fire Accident: యూపీ ఝాన్సీలోని (Jhansi) మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని (Maharani Laxmibhai Medical College) ఐసీయూలో ఘోర విషాద ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తోన్న సమయంలో మరో కీలక విషయం వెలుగుచూసింది. ఓ నర్సు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఆరోపించారు. హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ అనే వ్యక్తి కుమారుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో భగవాన్ దాస్ అక్కడే ఉన్నాడు. యూనిట్‌లో విధులు నిర్వహిస్తోన్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తోన్న సమయంలో దాని పక్కన మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని.. అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అది ఆక్సిజన్ ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టాయని.. వెంటనే నలుగురు పిల్లలను తన మెడకు బట్టలో చుట్టుకుని బయటకు పరిగెత్తానని చెప్పాడు. ఇతరుల సాయంతో మరికొంతమంది చిన్నారులను కాపాడగలిగామని పేర్కొన్నాడు.
తొక్కిసలాటతో పలువురికి గాయాలు
ఒక్కసారిగా మంటలు వ్యాపించి.. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఆస్పత్రిలో ఉన్న వారు భయంతో పరుగులు తీశారని.. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి చాలామంది గాయాలపాలయ్యారని తెలిపాడు. వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉన్నాయని.. ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ అలారాలు మోగకపోవడంతో అందరు చిన్నారులను రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని.. చిన్నారుల మరణాలకు కారణమైన వారిని వదిలిపెట్టమని అన్నారు.
ఇదీ జరిగింది
యూపీ ఝాన్సీ జిల్లాలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చిన్నారులకు చికిత్స అందించే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించి పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనలకు గురై పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసింది. మరోవైపు ఐసీయూ మొత్తం పొగతో నిండుకోవడంతో అక్కడి డాక్టర్లు, సిబ్బంది కిటికీ అద్దాలు బద్దలు కొట్టి శిశువులు, చిన్నారులను బయటకు తరలించారు. 35 నుంచి 40 మంది వరకు చిన్నారులను రక్షించారు. కానీ మరో 10 మంది శిశువులు ఈ దుర్ఘటనలో సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో గర్భిణీలను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు.
సీఎం యోగి దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ఇస్తామని తెలిపారు.