Suspecious in Bhongir Girl Students Forceful Death: భువనగిరి (Bhongir) జిల్లా కేంద్రంలో హాస్టల్ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల భవ్య (15),  వైష్ణవి (15)ల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలపై గాయాలు, పంటిగాట్లు ఉన్నట్లు ఇరువురి బాలికల కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికల హాస్టల్ లోకి వచ్చిన కొందరు ఆటో డ్రైవర్లు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తమకు తెలిసిందని వారు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సూసైడ్ నోట్ పైనా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు అక్కడకు వెళ్లి ఆందోళనకారులకు సద్దిచెప్పారు. మరోవైపు, ఈ కేసులో వార్డెన్ శైలజతో పాటు వంట మనుషులు, పీఈటీ, ట్యూషన్ టీచర్, ఓ ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నారు. 


ఇదీ జరిగింది


యాదాద్రి భువనగిరి (Bhongir) జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శనివారం రాత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) హాస్టల్ లో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. రోజూ మాదిరిగానే శనివారం స్కూలుకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం హాస్టల్ కు వచ్చారు. తర్వాత వసతి గృహంలో నిర్వహించే ట్యూషన్ కు హాజరు కాలేదు. టీచర్ పిలిచినా.. తాము రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజనానికి కూడా రాకపోవడంతో ఓ విద్యార్థిని వారి గది వద్దకు వెళ్లి చూడగా.. ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకుని కనిపించారు. ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా.. వారు వెంటనే అంబులెన్సును రప్పించి ఇద్దరినీ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులైన ఇద్దరు బాలికలు తమను వేధింపులకు గురి చేశారంటూ కొందరు 7వ తరగతి విద్యార్థినులు పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె వసతి గృహం వార్డెన్ శైలజకు సమాచారం ఇవ్వగా.. ఆమె ఇద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో తమపై ఫిర్యాదు చేశారనే మనస్తాపంతో, అవమానంగా భావించిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


సూసైడ్ నోట్ లభ్యం


ఘటనా స్థలంలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. 'మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని మాటలు అంటుంటే వాటిని తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని శైలజ మేడం తప్ప ఎవ్వరూ నమ్మడం లేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక ఇలా వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకే చోట సమాధి చెయ్యండి.' అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. అయితే, తమ పిల్లలది ఆత్మహత్య కాదని.. హత్య అని విచారించి తమకు న్యాయం చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.


Also Read: TSPSC: టీఎస్‌పీఎస్సీ కొత్త కార్యదర్శిగా నవీన్ నికోలస్‌ నియామకం, 9 మంది అధికారుల బదిలీలు