Chandrababu Attend Ra Kadali Ra Meeting In Madugula Today : రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభను సోమవారం అనకాపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరై ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగల నియోజకవర్గ పరిధి కె కోటపాడు మండలం గొండుపాలెంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు భారీగా తరలిరానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఉదయం 11.30 గంటటలకు సభా స్థలికి చేరుకుని సుమారు రెండు గంటలపాటు ప్రసంగించనున్నారు. ఈ సభ కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికతోపాటు ముఖ్య అతిథులు, మీడియా ప్రతినిధులు, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మద్ధతుదారులకు సంబంధించిన గ్యాలరీలు సిద్ధమయ్యాయి. సభా వేదికకు సమీపంలో హెలీప్యాడ్‌, వాహనాల పార్కింగ్‌కు స్థలాలను కేటాయించారు.


ఇదీ చంద్రబాబు షెడ్యూల్‌


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10 గటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరతారు. 11.20 గంటలకు కె కోటపాడు మండలం గొండుపాలెం హెలీ ప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11.30 గంటలకు రోడ్డు మార్గం సభా వేదిక వద్దకు వస్తారు. వేదిక వద్దకు చేరినప్పటి నుంచి 1.35 గంటల వరకు ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తారు. 1.40 గటలకు సభా వేదిక వద్ద నుంచి హెలీ ప్యాడ్‌కు చేరుకుని, 1.45 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కనిపూడిలో జరిగే రా కదలిరా సభలో పాల్గొనేందుకు వెళతారు. 


భారీగా ఏర్పాట్లు


మాడుగల నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రా కదలిరా సభకు భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. అనకాపల్లితోపాటు సమీప జిల్లాలైన విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభ బాధ్యతలను విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతోపాటు ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, గవిరెడ్డి రామానాయుడుతోపాటు కీలక నేతలు సభ జరగనున్న ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. సభకు కనీసం రెండు లక్షల మంది వస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. కేడర్‌కు దశా, నిర్ధేశం చేసేలా చంద్రబాబు ప్రసంగం ఉంటుందని నాయకులు చెబుతున్నారు.