Matrimony Fraud In Godavari Districts: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ.. ఎన్నో కష్టాలు పడింది. మీ ఇంటికెళ్లాక అయినా సుఖపడుతుంది.' అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదంతా నమ్మిన వారిని నట్టేట ముంచేస్తారు. పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్‌గా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలో ప.గో జిల్లాలో ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అక్క, ఓ బావ, అన్న, వదిన.. ఆపై అత్తమామలు.. ఆడపడుచు.. వీరంతా ఓ కుటుంబంగా ఉంటారు. తల్లిదండ్రులు లేని ఆ పేద యువతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇది నిజమని నమ్మిన వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి కనపడకుండా పోతారు. పెళ్లి కాని ప్రసాదులనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.
వాళ్లే టార్గెట్..
కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు తక్కువగా ఉండడంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన వీరు.. దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వీరి బలహీనతనే ఆసరాగా చేసుకున్న కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు సైతం పుట్టుకొచ్చాయి. రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువు కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మధ్యవర్తులను సంప్రదించగా భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని ఆయనకు సమాచారం పంపారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా.. యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి.. రూ.4.50 లక్షలు దండుకున్నారు.
యువతిని పెళ్లి చేసుకుని సొంతూరికి తీసుకెళ్లగా.. 2 రోజులకే అనారోగ్యమంటూ నాటకమాడింది. వారం తర్వాత తమ వారిని చూసొస్తామంటూ పట్టుబట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక మాయమాటలు చెప్పి కనిపించకుండా పోయింది. దీంతో మధ్యవర్తులకు ఫోన్ చేయగా.. మోసపోయినట్లు తేలింది. ఈ క్రమంలో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
అటు, ధర్మవరానికి చెందిన ఓ యువకుడు సైతం ఇదే తరహాలో రూ.3 లక్షలు మోసానికి గురయ్యాడు. అలాగే, సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి రూ.8 లక్షలు తీసుకుని కుచ్చుటోపీ పెట్టారు. కర్ణాటకలోనూ బాధితులు ఈ ముఠాల బారిన పడినట్లు తెలుస్తోంది. కొందరు నకిలీ వధువులైతే అత్తింటికి వెళ్లిన వెంటనే రాత్రికి రాత్రే నగదు, నగలతో పారిపోతున్నారు. ప.గో జిల్లా నవుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్క పాత్ర పోషిస్తోంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్న, బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తమామలు, తాడేపల్లిగూడెంలో ఆడపడుచు పాత్రధారులు ఉన్నారు. వీరంతా మాయమాటలతో కన్నీటిగాథలు చెప్పి పెళ్లి కాని వారి నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అయితే, వివాహమైన కొద్దిరోజులకు కానీ తాము మోసపోయామన్న సంగతి వరులకు తెలియడం లేదు. ఈ తరహా మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం