Missing Girl Found Dead In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం జరిగింది. మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ (Miyapur) పీఎస్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్‌కి చెందిన బాలిక(17) ఈ నెల 10న అదృశ్యమైంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారించిన పోలీసులు సోమవారం బాలిక మృతదేహాన్ని తుక్కుగూడలోని ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకుడే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తమ బిడ్డ బతికి ఉండేదని కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే తమ కూతురు బలైందని ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఘటనలు
అటు, మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కూలీ డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఓ వ్యక్తి మేస్త్రీ తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ (42) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన నరేశ్ మెదక్ జిల్లా కాళ్లకల్‌లో నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఆ పనులను ప్రమోదే గత ఆరు నెలలుగా కూలీలతో కలిసి చూస్తున్నాడు. ఇతని కింద హరియాణాకు చెందిన బిట్టు, అతని భార్య కూలీలుగా పని చేస్తున్నారు. కొద్ది రోజులుగా బిట్టు నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నాడు.
ఆదివారం రాత్రి పాశ్వాన్, బిట్టు మద్యం తాగడానికి వెళ్లారు. అక్కడ మద్యం తాగాక కూలీ డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన బిట్టు పాశ్వాన్ తలపై కర్రతో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటి యజమాని నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జంట హత్యలు
మరోవైపు, రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. పదేళ్ల క్రితం జరిగిన సోదరి హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో బావపై బామ్మర్ది దాడి చేయడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల గ్రామానికి చెందిన యాదయ్య తన భార్యను 2014లో హతమార్చాడు. ఈ కేసులో జైలుకెళ్లి విడుదలయ్యాడు. ఆదివారం యాదయ్య ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు అతని బామ్మర్తి శ్రీను హాజరయ్యాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి యాదయ్యపై శ్రీను దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, శ్రీనుపై బంధువులు, గ్రామస్థులు దాడి చేయడంతో అతను కూడా మృతి చెందాడు. గ్రామస్థులు మాత్రం పరస్పర దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.