Kolkata Case: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా హత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న దారుణాలను కట్టడి చేయాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. రోజూ దేశవ్యాప్తంగా కనీసం 90 అత్యాచార ఘటనలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోందని అందులో ప్రస్తావించారు. ఈ తరహా కేసులలో సత్వర న్యాయం జరిగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యాచారాలను కట్టడి చేసేలా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాలని అడిగారు. ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వయంగా ఆమే ఈ ఘటనను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీ విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ప్రధానికి లేఖ రాయడం కీలకంగా మారింది. (Also Read: Kolkata: పాపం నా బిడ్డ ఎంత విలవిలాడిపోయిందో, నన్ను తలుచుకుని ఏడ్చిందేమో - బాధితురాలి తల్లి ఆవేదన)
"ప్రధాని మోదీజీ దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం రోజూ కనీసం 90 కేసులు నమోదవుతున్నాయి. మన దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయి. దేశంలో ఉన్న మహిళలంతా తాము సురక్షితంగా ఉన్నామన్న భరోసా ఇవ్వగలగాల్సిన అవసరముంది. ఇలాంటి దారుణాలను కఠినంగానే పరిగణించాలి. చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలి. విచారణ వేగవంతంగా జరగాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి. 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి"
- మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి
మమతాపై విమర్శలు..
మమతా సర్కార్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శాంతిభద్రతలు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని వైద్యులు మండి పడుతున్నారు. అటు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెబుతోంది. అటు ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేకంగా సిట్‌ని నియమించింది. నెలరోజుల్లోగా పూర్తిస్థాయిలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆదేశించింది. పోలీసులపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే...హాస్పిటల్‌పై దాడి జరిగిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. ఇదంతా బీజేపీ పనేనని ఆరోపించారు. ఇది రాజకీయంగా దుమారం రేపింది.
Also Read: Kolkata: డాక్టర్ చెంపలు పెదాలు మెడపై చీరుకుపోయిన గాయాలు, క్రూరత్వానికి పరాకాష్ఠ