Kolkata Doctor Autopsy Report: కోల్‌కతా బాధితురాలి అటాప్సీ రిపోర్ట్‌లో మరి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖం, మెడపై లోతైన గాయాలున్నట్టు వైద్యులు గుర్తించారు. బాధితురాలి రెండు చెంపలూ చీరుకుపోయాయి. చనిపోయే ముందు విపరీతమైన టార్చర్ అనుభవించినట్టు వెల్లడైంది. పెదాలూ ఇంతే దారుణంగా చీరుకుపోయినట్టు రిపోర్ట్‌లో ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఓ పెదవి మధ్యలో గాయమైంది. రెండు పెదాల లోపలి భాగంలోనూ తీవ్రంగా ఒరుసుకుపోయినట్టు గాయాలున్నాయి. ముక్కుపైనా తీవ్ర గాయాలయ్యాయి. కుడి దవడపైనా గట్టిగా కొట్టినట్టు రాసుకుపోయిన గాయాన్ని గుర్తించారు.
ఇక మెడకు ఎడమ భాగంలోనూ ఇదే తరహా గాయాలు కనిపించాయి. బలవంతంగా కొరకడం వల్ల ఈ గాయాలైనట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎడమ మోచేయి, ఎడమ మోకాలు, భుజంపైనా దెబ్బలున్నట్టు రిపోర్ట్ పేర్కొంది. తల, మెడతో పాటు థైరాయిడ్‌పైనా దాడి చేయడం వల్ల అక్కడా గాయాలయ్యాయి. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ గాయాలన్నీ చనిపోయే ముందే అయ్యాయి. ఈ రిపోర్ట్‌ని చూసిన ఓ డాక్టర్ ఇది కచ్చితంగా కక్షగట్టి హత్య చేసినట్టుగా అనిపిస్తోందని అన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టుగానే ఎవరో పురమాయించి ఈ హత్య చేయించారా అన్న అనుమానాలకు ఈ రిపోర్ట్ బలం చేకూరుస్తోంది.
"బాధితురాలి ముఖంపైన బలమైన గాయాలున్నాయి. వీటిని బట్టి చూస్తుంటే ఆమెని చిత్రహింసలకు గురి చేసి దారుణంగా కొట్టి హత్యాచారం చేసినట్టు అర్థమవుతోంది. ఎడమ కాలితో పాటు కళ్లు, మెడపైన చీరుకుపోయిన గాయాలున్నాయి. వీటన్నింటిపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగి తీరాల్సిందే"
- పేరు చెప్పని ఓ వైద్యుడు
అయితే...హత్య చేశాక అత్యాచారం చేశాడా..? లేదంటే అత్యాచారం చేశాక చంపేశాడా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ హత్యలో కచ్చితంగా హాస్పిటల్ వాళ్ల హస్తం ఉందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. తమకు ఏ మాత్రం సహకరించలేదని, పైగా ఇబ్బంది పెట్టారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Kolkata: 11 రోజుల ఆందోళనలకు విరామం, సుప్రీంకోర్టు సూచనలతో వైద్యుల కీలక నిర్ణయం