Kolkata Doctor Death Case: కోల్‌కతా ఘటనను నిరసిస్తూ దాదాపు 11 రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కారణంగా పలు చోట్ల వైద్య సేవలు అంతరాయం కలుగుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. ఈ మేరకు ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌ కీలక ప్రకటన చేసింది. నిరసనలు విరమించి విధుల్లో చేరనున్నట్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌ ఘటనలో న్యాయస్థానం తీసుకుంటున్న చొరవ చాలా సంతృప్తికరంగా ఉందని, వైద్య సిబ్బంది భద్రత గురించి కోర్టు ప్రస్తావించడం ఊరటనిచ్చిందని వెల్లడించింది. 


"సుప్రీంకోర్టు సూచనల మేరకు 11 రోజుల మా నిరసనలను ఇకపై నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసులో ప్రత్యేక చొరవ తీసుకుంటుండడం నిజంగా అభినందనీయం. వైద్య సిబ్బంది భద్రత గురించీ ప్రస్తావించడం ఎంతో ఊరటనిచ్చింది. అందుకే ఆందోళనలు రద్దు చేస్తున్నాం"


- రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ఢిల్లీ ఎయిమ్స్ 






ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వైద్యులకు భరోసా ఇచ్చింది. "దయచేసి మాపై భరోసా ఉంచండి. విధుల్లోకి వెళ్లండి" అని సూచించింది. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, అందుకే ఆందోళనలు విరమిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. నిరసనల్లో పాల్గొన్న వైద్యులపై ఎలాంటి చర్యలు ఉండవని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆందోళనలు విరమించినా వైద్యుల భద్రతకు తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని వెల్లడించింది. (Also Read: Kolkata: పాపం నా బిడ్డ ఎంత విలవిలాడిపోయిందో, నన్ను తలుచుకుని ఏడ్చిందేమో - బాధితురాలి తల్లి ఆవేదన)


"దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులందరికీ మాదో సూచన. మీ భద్రతకు భరోసా మాది. అందుకే మేమున్నాం. మాపైన నమ్మకం ఉంచండి. అందుకే మేం ఈ కేసుని కోల్‌కత్తా హైకోర్టుకి మాత్రమే అప్పగించి ఊరుకోలేదు. మళ్లీ విధుల్లో చేరండి"


- సుప్రీంకోర్టు


ఆగస్టు 9వ తేదీన ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవలే 24 గంటల పాటు వైద్య సేవల బంద్ పాటించింది. ఆ తరవాత కూడా పలు చోట్ల వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, తానూ ఓ సారి హాస్పిటల్‌లో వైద్యం కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 


Also Read: Kolkata: కోల్‌కతా హాస్పిటల్ పేరు తప్పుగా పలికిన చీఫ్ జస్టిస్‌, వెంటనే తప్పు సరిదిద్దుకుని క్షమాపణలు