Kolkata Doctor Death Case: కోల్‌కతా డాక్టర్ తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురిని ఎవరో చంపించారని ఆరోపించారు. సంజయ్ రాయ్‌ని పురమాయించి అతనితో హత్యాచారం చేయించారని వెల్లడించారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. హాస్పిటల్‌లోని చీకటి రహస్యాలు తన కూతురికి తెలిశాయని, వాటిని ఎక్కడ బయటపెడుతుందోనన్న అనుమానంతో ఇలా హత్య చేయించారని బాధితురాలి తల్లి ఆరోపించారు.
"సంజయ్ రాయ్‌ని ఎవరో పురమాయించి నా కూతురుని హత్య చేయించారు. సోషల్ మీడియాలో మా కూతురు గురించి వస్తున్న వదంతులు చూస్తుంటే సహనం చచ్చిపోతోంది. పాపం. నా కూతురు ఆ సమయంలో ఎంత నరకం అనుభవించిందో. నన్ను తలుచుకుని ఎంతగా ఏడ్చిందో"
- బాధితురాలి తల్లి
ఇంత జరిగినా అప్పటికి కాలేజ్ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ కనీసం తమతో మాట్లాడలేదని, ఇంత దారుణం జరిగినందుకు క్షమాపణలు కూడా చెప్పలేదని అన్నారు బాధితురాలి తల్లి. సందీప్ ఘోష్ తనను ఎగ్జామ్‌లో ఫెయిల్ చేస్తాడని చాలా సార్లు భయపడినట్టు చెప్పారు. చివరిసారిగా తన కూతురు "అమ్మ ఫుడ్ వచ్చింది" అని చెప్పిందని, ఆ తరవాతే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రికి మందులు ఆర్డర్ చేయాలనుకుందని, ఆ తరవాతే డిన్నర్ చేయడానికి వెళ్లాలనుకుందని వివరించారు. కానీ..అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తమ ఇంటికి వచ్చారని, న్యాయం జరుగుతుందన్న భరోసా ఇచ్చారని వెల్లడించారు. తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక పోలీసులతో పాటు ఆర్‌జీ కార్ హాస్పిటల్ సిబ్బందిపైనా బాధితురాలి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"వాళ్లు మా దగ్గర ఏదో దాచారు. ఏదీ సరిగ్గా చెప్పలేదు. నా కూతురి మృతదేహాన్ని కూడా ఆలస్యంగా చూపించారు. నాలుగు గంటల పాటు మమ్మల్ని అక్కడే ఉంచాల్సిన అవసరం ఏముంది..? వాళ్లు ఏం దాస్తున్నారు..? అంత్యక్రియలు చేసేయాలని హడావుడి చేశారు"
- బాధితురాలి తల్లి
మెడిసిన్‌లో డాక్టరేట్ చేయాలనుకునుకుందని, చదువుకోడానికి పుస్తకాలు తెచ్చుకుందని బాధితురాలి తల్లి వివరించారు. ఉద్యోగం అంటే తనకు ఎంతో ఇష్టమని 36 గంటల పాటు విరామం లేకుండా పని చేసి కూడా మళ్లీ ఇంటికి రాగానే ఏదో ఓ పుస్తకం చదువుకునేదని, ఆన్‌లైన్ కోర్సులూ చేసేదని చెప్పారు. కొవిడ్ తీవ్రంగా ఉన్నప్పుడు మున్సిపల్ హాస్పిటల్‌లో వరుసగా నాలుగు రోజుల పాటు డ్యూటీ చేసిందని గుర్తు చేసుకున్నారు. కచ్చితంగా గోల్డ్‌మెడల్ సాధిస్తానని చెప్పేదని అన్నారు. (Also Read: Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్)
"తన పెళ్లి ఖర్చుల కోసం తానే సంపాదించుకుంది. తండ్రికి రూ.5 లక్షలు ఇవ్వాలని కూడబెట్టుకుంది. కానీ ఇదంతా జరగకుండానే తను బలి అయిపోయింది. తన ఫోన్, ల్యాప్‌టాప్ సీబీఐ వద్దే ఉన్నాయి. ఇప్పుడు మాకు కావాల్సింది న్యాయం జరగడం"
- బాధితురాలి తల్లి
Also Read: Kolkata: సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్