Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ ఓ నివేదిక తయారు చేసింది. ఈ రిపోర్ట్‌ని సుప్రీంకోర్టులో సమర్పించింది. అయితే..ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది దర్యాప్తు సంస్థ. నేరం జరిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నం జరిగిందని, బాధితురాలి కుటుంబ సభ్యుల్ని తప్పుదోవ పట్టించారని తేల్చి చెప్పింది. సీబీఐ తరపున వాదించిన సొలిసిటర్ జనరల తుషార్ మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదో రోజు విచారణ కొనసాగుతోందని, అయితే..క్రైమ్ సీన్‌ని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. అటు ప్రభుత్వం మాత్రం అదేమీ లేదని తేల్చి చెబుతోంది. ప్రతిదీ వీడియో తీశామని, అన్ని ఆధారాలున్నాయని వివరిస్తోంది. ఈ సందర్భంగా FIR నమోదైన తీరుపైనా సీబీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం జరిగిందని, ఈ విషయం బాధితురాలి కుటుంబ సభ్యులకూ అర్థమైందని వెల్లడించింది.
"అన్నింటి కన్నా దిగ్భ్రాంతి కలిగించే నిజం ఏంటంటే బాధితురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక 11.45 గంటలకు FIR నమోదు చేశారు. తల్లిదండ్రులకు ఇది ఆత్మహత్యే అని చెప్పి నమ్మించారు. ఆ తరవాత అంతా వీడియో తీశారు. ఇవన్నీ చూశాక కుటుంబ సభ్యులకూ అనుమానాలు వచ్చాయి. అక్కడ ఏదో దాస్తున్నట్టు వాళ్లూ సందేహించారు"
- సీబీఐ
ఈ కేసులో ఆర్‌జీ కార్ హాస్పటల్ వ్యవహరించిన తీరుపైనా సీబీఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులలో ప్రోటోకాల్‌ని పక్కన పెట్టి మరీ హాస్పిటల్ అధికారులు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ని వెంటనే విధుల్లో నుంచి తప్పించారని వెల్లడించింది. అంతే కాకుండా క్రైమ్ సీన్‌ని కాపాడడంలోనూ విఫలమయ్యారని రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఈ హత్యాచారం గురించి తెలిశాక కూడా సందీప్ ఘోష్ ఏ విధంగానూ స్పందించలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాడని సీబీఐ స్పష్టం చేసింది. నేరం జరిగిన చోట మరమ్మతులు చేయడంపైనా సీబీఐ ఫోకస్ పెట్టింది. సందీప్ ఘోష్‌ని ఇదే విషయమై ప్రశ్నిస్తోంది. నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అనుమతి వచ్చింది. అయితే...అధికారులు ఇంకా ఈ టెస్ట్ చేయాల్సి ఉంది.
హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌కీ లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నా సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పైగా సందీప్ ఘోష్‌కి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనితో పాటు పని చేసిన అధికారి ఒకరు చేసిన ఆరోపణలు కీలకంగా మారాయి. అనాథ శవాలను అమ్ముకుని వ్యాపారం చేసే వాడని ఆరోపించాడు. అంతే కాదు. బంగ్లాదేశ్ మాఫియాతోనూ లింక్స్ ఉన్నాయని చెప్పాడు. బయో వేస్ట్‌ని బంగ్లాదేశ్‌కి సప్లై చేస్తాడని ఆరోపించడమూ సంచలనమైంది. విద్యార్థులను కావాలనే ఫెయిల్ చేసి వాళ్ల నుంచి డబ్బులు గుంజి పాస్ చేసే వాడనీ అన్నాడు. ఈ ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారిస్తోంది.
Also Read: Kolkata: 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు, కోల్‌కతా హత్యాచార ఘటనపై చీఫ్ జస్టిస్