Delhi Airport jawan gave life with CPR :  జీవితం క్షణ భంగురం అంటారు పెద్దలు. నిజమే తర్వాత క్షణంలో  ప్రాణం ఉంటుందో లేదో చెప్పడం కష్టం. ఇటీవలి కాలంలో ఇంకా ఎక్కువగా అలా మాట్లాడుతూనే కుప్పకూలిపోయేవారు ఎక్కువగా ఉంటున్నారు. అందుకే వైద్యులు ఇటీవలి కాలంలో సీపీఆర్ విధానాన్ని అందరూ నేర్చుకోవాలని సిఫారసు చేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో విధులు నిర్వహించే వారందరికీ సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఇలాంటి వాటి వల్ల అనేకే ప్రాణాలు నిలబడతాయి కూడా. దానికి సాక్ష్యం ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటన. 


ఎయిర్ పోర్టులో పడిపోయిన  ఆయూబ్                         


శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఆర్షద్ ఆయూబ్ అనే వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. టెర్మినల్ నుంచి బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సీఐఎస్ఎఫ్ జవాన్ అక్కడికి వచ్చారు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. వెంటనే.. ఆయూబ్‌కు సీపీఆర్ ప్రారంభించాడు. అచేతనంగా ఉన్న ఆయూబ్..కు రెండు నిమిషాలు సీపీఆర్ చేయగానే కదలికల్లోకి వచ్చాడు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో సప్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతనికి ప్రాణాపాయం తప్పింది. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. 


ఇలా సీఐఎస్ఎఫ్ జవాన్ ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  



సీపీఆర్‌పై అవగాహన పెంచుకుంటే ఎంతో మంది ప్రాణాలకు రక్షణ                         


సీపీఆర్ అంటే కార్డియో పల్మరీ రిసస్కిటేషన్. గుండెపోటుకు గురైన వ్యక్తికి పల్స్ అందదు. మెడ దగ్గర కూడా పల్స్ అందకపోతే.. గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లే. వెంటనే..  పేషెంట్​ ఛాతీ మీద..   మధ్య భాగంలో చేత్తో ప్రెస్​ చేస్తూ పోవాలి.  ఇలా చేసేటప్పుడు  చేతులు బెండ్​ కాకుండా స్టైట్‌గా ఉండాలి.  ఛాతీని కనీసం 5 సెంటీమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.  నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేస్తూ పోతే.. మళ్లీ గుండెకు రక్త ప్రసరణ అందే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు నిమిషాలు చేసినా స్పందన లేకపోతే.. కనీసం ఇరవై నిమిషాల సేపు చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి ఇలా సీపీఆర్ చేయడం వల్ల ఎక్కువ సందర్భాల్లో ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ సీపీఆర్ ప్రాసెస్ ను తెలుసుకోవాలని క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు.