Mahabubnagar Crime News: బడిలో ఒంటరిగా ఆడుకుంటున్న పాప వద్దకు వచ్చిన ఓ మహిళ బాలిక దగ్గర నుంచి బ్యాగు లాక్కునే ప్రయత్నం చేసింది. పాప గట్టిగా ఏడుస్తూ ఎంతకూ ఇవ్వకపోవడంతో.. చెంపపై గట్టిగా కొట్టింది. ఆపై బాలిక చేతికి ఓ సూదిమందు ఇచ్చి అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత ఏడుస్తూ ఇంటికి చేరుకున్న బాలికను ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత రోజు నుంచి బాలిక తీవ్ర అస్వస్థతతకు గురైంది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. పుట్టోనిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్, అలివేలు భార్యాభర్తలు. వీరికి అనన్య అనే కుమార్తె ఉంది. అయితే అనన్య పుట్టోనిపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈనెల 9వ తేదీన సాయంత్రం అనన్య బడిలో ఒంటరిగా ఆడుకుంటోంది. అయితే ఆశా వర్కర్ వేషధారణలో ఉన్న ఓ గుర్తు తెలియని మహిళ.. పాప వద్ద నుంచి బ్యాగు లాక్కునే ప్రయత్నం చేసింది. అనన్య మాత్రం బ్యాగు ఇవ్వకుండా విపరీతంగా ఏడవడం మొదలు పెట్టింది. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు మహిళ అనన్య చెంపపై గట్టిగా కొట్టింది. ఆ తర్వాత అనన్య చెంపపై కొట్టి కుడిచేతికి సూదిమందు ఇచ్చి వెళ్లిపోయింది. 


ఏడుస్తూ ఇంటికెళ్లిన అనన్య - విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు


అనన్య ఏడుస్తూనే.. ఇంటికి వెళ్లింది. బాలిక అలా రావడంతో.. తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. అనన్య ఏడుస్తూనే జరిగిన విషయం వివరించింది. దీంతో లక్ష్మణ్ నాయక్, అలివేలు వెంటనే గ్రామంలోని ఆశా వర్కర్ల వద్దకు వెళ్లారు. సూదిమందు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించగా అదేం లేదని, తమకు జరిగిన విషయం కూడా తెలియని చెప్పారు. అయితే మరుసటి రోజు అనన్య తీవ్ర అస్వస్థతకు గురైంది. భయపడిపోయిన తల్లిదండ్రులు బాలికను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బ్లడ్ ఇన్ ఫెక్షన్ అయిందని, చికిత్స అందించారు. అనంతరం అనన్యను ఇంటికి తీసుకొచ్చారు. 


అనారోగ్యం బాగోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు..!


అయితే అప్పటి వరకు కాస్త ఆరోగ్యంగానే ఉన్న అనన్య సోమవారం మళ్లీ అస్వస్థతకు గురైంది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు మహబూబ్ నగర్ లోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స అందించారు. అయితే ఎవరో తమ కూతురుకు సూదిమందు ఇవ్వడం వల్లే పాప అనారోగ్యానికి గురువుతుందంటూ పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా చెప్పి ఫర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై పురుషోత్తం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలు అనన్య బ్యాగులో ఏముంది, ఓ మహిళ వచ్చి ఆమె బ్యాగును ఎందుకు లాక్కునే ప్రయత్నం చేశారు, ఎందుకు, ఎలాంటి సూది మందు ఇచ్చి వెళ్లిపోయిందనే విషయంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆశా వర్కర్ రూపంలో అసలు బడిలోకి ఎవరు వచ్చారో కచ్చితంగా కనుక్కోవాలని పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.