Madhyapradesh Police Busted Robbery Brothers Trick: వామ్మో వారిద్దరు సోదరులు మామూలు వాళ్లు కాదు. ఎలాగంటారా.? నిమిషాల వ్యవధిలోనే పుట్టిన ఈ హలో బ్రదర్స్.. చోరీలు చేయడంలో దిట్ట. చూసేందుకు ఒకేలా ఉండే వీరిలో ఒకడు చోరీ చేస్తే ఇంకొకడు వేరే ప్రదేశంలో ఉంటూ ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తాడు. ఇదిగో నేను అక్కడ ఉన్నానంటూ పోలీసులను సైతం బోల్తా కొట్టిస్తాడు. కొన్నేళ్లుగా వరుస చోరీలు చేస్తూ పోలీసులకే సవాల్ విసిరిన ఈ హలో దొంగ బ్రదర్స్ ఆటలకు తాజాగా చెక్ పెట్టారు. తెలుగు సినిమా కథను తలపించేలా ఉన్న ఈ స్టోరీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు (Madhyapradesh) చెందిన సౌరభ్‌వర్మ, సంజీవ్‌వర్మ కవల సోదరులు. దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. అసలు వీరిద్దరూ అన్నదమ్ములు అన్న సంగతి ఆ గ్రామస్థులకు మినహా బయటి వ్యక్తులకు ఎవరికీ పెద్దగా తెలియదు. చోరీల్లో భాగంగా ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసుండడం కూడా అరుదే. ఒకేలాంటి దుస్తులు ధరించడం, ఒకేలాంటి ఆహార్యంతో అందరినీ ఏమారుస్తున్నారు. ఏళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇందులో సౌరభ్‌వర్మ దొంగతనాలు చేయడంలో దిట్టైతే.. సంజీవ్‌వర్మ తప్పుదోవ పట్టించడంలో ఆరితేరాడు. సౌరభ్ ఎక్కడైనా దొంగతనం చేస్తే.. సంజీవ్ వేరే చోట తాను ఉన్న సీసీ టీవీ ఫుటేజీ సంపాదించి పోలీసులను ఏమారుస్తాడు. అలా చోరీ చేసిన డబ్బులతో అందరికీ మస్కా కొట్టి జల్సాలు చేశారు.
పోలీసులు చెక్ పెట్టారిలా..
ఈ నెల 23న మౌగంజ్ సిటీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు రూ.లక్షల్లో నగదు, నగలు దోచుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఇందులో సౌరభ్‌వర్మ సైతం ఉన్నాడు. అయితే, సౌరభ్ కోసం సంజీవ్ రావడంతో ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. లోపల ఉన్నవాడు బయటకు ఎలా వచ్చాడంటూ పోలీసులే షాక్ అయ్యారు. ఇద్దరూ అన్నదమ్ములు అన్న విషయం తెలుసుకుని.. వరుస చోరీలపై విచారణ చేశారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగుచూసింది. కవల సోదరుల క్రైమ్ స్టోరీ బయటపడింది. నిందితుల నుంచి పోలీసులు లక్షలాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.