మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఈ రోజు (నవంబర్ 4) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో, బస్సు - కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో 11 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి గాయాలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ సమాచారం అందించారు.


వార్తా సంస్థ ANI ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోను ట్వీట్ చేసింది. దీని ద్వారా బస్సు - కారు ఎదురెదురుగా ఢీకొన్నాయని అర్థం అవుతోంది. కారు ఎలా తుక్కుతుక్కు అయిందో చూడవచ్చు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారని భావిస్తున్నారు. బస్సు ముందు భాగం మాత్రమే దెబ్బతింది.


ఇంతకు ముందు అక్టోబర్ 21 రాత్రి మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీపావళికి రెండు రోజుల ముందు, రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోహగి పర్వతాల వద్ద బస్సు - ట్రక్కు భయంకరంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి యూపీ రాజధాని లక్నో వస్తున్న ఈ బస్సులో రోజు కూలీలు ఉన్నారు.