Madanapalle Crime : ప్రస్తుత సమాజంలో కొందరు యువకులు ఈజీ మనీకి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ వారి జీవితాలను నాశనం చేసుకునేలా చేస్తుంది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఓ యువకుడు వేసిన ఆలోచన పోలీసులనే షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ యువకుడు వేసిన ప్లాన్ ఏమింటంటే?
జల్సాలకు అలవాటు పడి
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం వేపులపల్లి గ్రామంలో మహేశ్వర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. బీటెక్ వరకూ చదివిన మహేశ్వర్ రెడ్డి కొంత కాలం ఉద్యోగం చేశాడు. అయితే జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసగా మారిన మహేశ్వర్ రెడ్డికి ఆ నగదు సరిపడేది కాదు. దీంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఈజీ మనీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేసేవాడు. మదనపల్లెకు చెందిన మౌలా దగ్గర మహేంద్ర లోగో కారు, పీటీఎం మండలానికి చెందిన అనిల్ రెడ్డి వద్ద ఎక్స్‌యూవి 500 కారు రోజు బాడుగకు తీసుకున్నాడు. కొద్ది రోజుల పాటు వారికి నమ్మకంగా ఉంటూ నమ్మించాడు. అలాగే కారును బాడుగకు తీసుకొనే ముందు తన ఆధార్ కార్డు, ఇతర వివరాలను తెలిపేవాడు. కారును బాడుగకు తీసుకున్న తరువాత మూడు నెలలుగా బాడుగ డబ్బులు ఇవ్వకుండా, ఫోన్ స్విఛ్చ్ ఆఫ్ చేసి తప్పించుకుని తిరిగే వాడు. అంతే కాకుండా కారును కూడా తిరిగి ఇచ్చేవాడు కాదు.
తప్పించుకుని తిరుగుతూ
డబ్బు అవసరం అయ్యే సరికి బాడుగకు తీసుకున్న కార్లను ఏకంగా అమ్మడానికి ప్రయత్నం చేశాడు మహేశ్వర్ రెడ్డి. అయితే కార్లను బాడుగకు ఇచ్చిన కారు యజమానులు ఎన్ని సార్లు మహేశ్వర్ రెడ్డి ఇంటికి తిరిగినా తాళాలు వేసి ఉండడం, అతని గురించి ఎవరికి సరైనా వివరాలు తెలియకపోవడంతో అనుమానం వచ్చిన కారు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు మహేశ్వర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా మహేశ్వర్ రెడ్డి తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. మహేశ్వర్ రెడ్డి ఆధీనంలో ఉన్న ఇరవై ఐదు లక్షల విలువ చేసే కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచ్చారి అన్నారు..