ఆస్తిపాస్తులు, డబ్బు మనిషిని ఎంతటి నేరానికైనా పాల్పడేలా చేస్తాయని చాటే ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఓ చెల్లెలు, తన తల్లితో కుమ్మక్కై ప్రియుడితో కలిసి సొంత అన్నని చంపించింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగింది. తొలుత మిస్టరీ కేసుగా పోలీసులు దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. విచారణ అనంతరం పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. స్వయానా హత్యకు గురైన వ్యక్తి చెల్లెలే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు తేల్చారు.
సూత్రధారి అయిన చెల్లెలు నిర్మలమ్మ తో ఫోన్ సంభాషణలు ఉన్న కాల్ రికార్డులు, హత్య చేయడానికి వాడిన కత్తి, రక్తపు మరకలు ఉన్న నిందితుడి బట్టలు, మోటారు సైకిల్ వంటి ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు చెల్లెలే ప్రధాన సూత్రధారి అని నిర్ధారణకు వచ్చారు. నిందితుల నుంచి సైకిల్ తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దిన్నెదేవరపాడుకు చెందిన మాధవస్వామి అనే వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం తల్లి, అతని చెల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. మాధవస్వామికి గ్రామంలో ముందు తరాల నుంచి వచ్చిన రూ.60 లక్షల విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. దీనిని అమ్మేందుకు తల్లి ఎల్లమ్మ, చెల్లెలు నిర్మలమ్మ ప్రయత్నిస్తున్నారు. అయితే, అందుకు మాధవ స్వామి ఒప్పుకోలేదు. దీంతో వారు అతనిపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పక్కాగా ప్రణాళిక రూపొందించారు. మాధవ స్వామిని చంపాలని నిర్ణయించుకున్నారు. నిర్మలమ్మ తన ప్రియుడు లక్ష్మన్నతో ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ.10 వేలు ఇచ్చేలా పని పూర్తయ్యాక 3 సెంట్ల స్థలం లేదా స్థలానికి తగ్గట్లుగా డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
ప్రణాళికలో భాగంగా ఈ నెల 13న తాగుదామని చెప్పి రాత్రి మద్యం తాగేందుకు మాధవ స్వామిని లక్ష్మన్న తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా మాధవస్వామిపై దాడి చేసి, గొంతు కోసి చంపేశాడు. నిర్మలమ్మ, లక్ష్మన్న సంభాషణలు ఉన్న వాయిస్ రికార్డు, హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న నిందితుడి బట్టలు, మోటారు సైకిల్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.