కోనసీమ జిల్లాలో విషాదం, బైక్‌ను వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం
బైక్‌ను ఢీకొట్టిన పాల వ్యాను, ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి


Road Accident in Konaseema District: కోనసీమ జిల్లాలో విషాదం జరిగింది. బైకు, వ్యాన్ ఢీకొనడంతో రావులపాలెం మండలం కొమర్రాజులంకకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహేతర సంబంధంపై నిలదీయడానికి వెళ్లిన కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


వేరే మహిళతో సహజీవనం.. 
పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజులంకకు చెందిన అప్పన నాగేశ్వరరావు గత కొంతకాలం నుంచి ఇంటికి సరిగా రావడం లేదు. విషయం ఏంటని ఆరా తీసిన కుటుంసభ్యులు వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్నారు. కొత్తపేటలో నివాసం ఉండే మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. నాగేశ్వరరావు తల్లి సత్యవతి, భార్య వెంకటలక్ష్మి, కుమారుడు మహేష్ గురువారం అర్ధరాత్రి కొత్తపేటకు వెళ్లారు. తమ వెంట ఇంటికి వచ్చేయాలని నాగేశ్వరరావును కోరారు. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగింది.


పాల వ్యాన్ ఢీకొట్టడంతో విషాదం.. 
చేసేదేమీలేక బైకుపై సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో కొత్తపేట మండలం మందపల్లి వద్ద వీరి బైకు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ పాల వ్యాన్, వీరు ప్రయాణిస్తున్న బైకును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రావులపాలెం వైపు నుండి కొత్తపేట వైపు వెళ్తున్న పాల వ్యాన్, కొమర్రాజులంకకు వెళ్తున్న వీరి బైకును ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సత్యవతి, వెంకటలక్ష్మి, మహేష్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


కాగా, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను పద్ధతి మార్చుకోవాలని సర్దిచెప్పి ఇంటికి రావాలని కోరేందుకు వెళ్లిన భార్యతో పాటు ఆమె అత్త, కుమారుడు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ ప్రమాదానికి, వివాహేతర సంబంధానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.