Kolkata Doctor Case Updates: ఎన్నో చిక్కుముడులు. మరెన్నో అనుమానాలు. ఏదీ స్పష్టంగా లేదు. ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. కోల్‌కత్తా ఘటన ఇప్పటికీ ఓ మిస్టరీయే. ఆగస్టు 9న హత్యాచారం జరిగింది. ఇప్పటికి 10 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ ఈ కేసులో ఏ పురోగతి కనిపించడం లేదు. సీబీఐ విచారణ జరుగుతోందన్న ఒక్క సమాచారం తప్ప మరేమీ తెలియడం లేదు. అసలు ఎందుకు అత్యాచారం చేశారు..? ఆ అత్యాచారం చేసిన వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడు..? అంత దారుణంగా హింసించి చంపాల్సినంత కక్ష ఏముంది..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. వీటిలో దేనికీ ఇంకా సమాధానం దొరకలేదు. ఇలా ఎన్నో "లేదు, కాదు" లు ఉండడం వల్లే పెద్ద కన్‌ఫ్యూజన్‌ ఏర్పడింది. ఎవరికి తోచిన "థియరీ" వాళ్లు చెబుతున్నారు.


ట్రైనీ డాక్టర్‌తో పాటు పని చేసే వాళ్ల వర్షన్ మాత్రం ఈ కేసుని మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఆమెని టార్గెట్ చేసి చంపారన్నది వాళ్లు చెబుతున్న థియరీలోని సారాంశం. అదే ఎందుకు అని ప్రశ్నిస్తే వాళ్లు చెప్పిన సమాధానాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు ABP న్యూస్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయం చెప్పారు. "ఓ సీనియర్ వల్ల నా కూతురు చాలా ఇబ్బంది పడింది" అని వెల్లడించారు. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హాస్పిటల్‌లో ఏదో రాజకీయం జరిగి ఉండాలన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇక కొలీగ్స్ చెబుతున్న అంశాలూ కీలకంగా మారాయి. 



ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలి కొలీగ్స్ ఇదే పేరుని పదేపదే ప్రస్తావిస్తున్నారు. "ఇది కేవలం హత్యాచారం కేసు కాదు. అంతకి మించి ఇంకేదో కుట్ర ఉంది. ఆమె సెమినార్ హాల్‌లో ఒంటరిగా ఉందని ఆ వ్యక్తికి ఎలా తెలిసింది" అని ప్రశ్నిస్తున్నారు తోటి వైద్యులు. ఇక మరో సంచలన విషయం ఏంటంటే...హాస్పిటల్‌లో పెద్ద ఎత్తున డ్రగ్ రాకెట్‌ జరుగుతోంది, ఆ రహస్యాలన్నీ బాధితురాలికి తెలిసిపోయి ఉంటాయని అంటున్నారు. అందుకే..ఆ రహస్యాలు ఎక్కడ బయటపెడుతుందో అన్న భయంతో ఆమెని ఇంత దారుణంగా చంపేసి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు.


అయితే...కొందరు ఆమెని కావాలనే టార్గెట్ చేసి ఎక్కువ గంటలు పని చేయించినట్టు చెబుతున్నారు. ఆమె డైరీలో కూడా ఈ వర్క్ ప్రెజర్‌ గురించి రాసుకున్నట్టు తల్లిదండ్రులు ఇప్పటికే వెల్లడించారు. ఒక్కోసారి 36 గంటల పాటు కంటిన్యూగా పని చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్‌ కనిపించకుండా పోయాడు. సీబీఐ రంగంలోకి దిగాక ఆయనపై నిఘా పెంచింది. ఆ రాత్రి ఎక్కడున్నారని విచారిస్తోంది. ఆయన చెప్పిన వివరాలను, హాస్పిటల్‌లోని మిగతా వైద్యుల వర్షన్‌ని పోల్చుకుని చూసుకుంటోంది సీబీఐ. తెల్లవారుజామున 3-5 గంటల మధ్యలో ఈ హత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ టైమ్‌ కూడా ఈ కేసుని ఛేదించడంలో కీలకంగా మారనుంది. 


Also Read: Kolkata: కోల్‌కత్తా ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు