Boy Kidnap: విజయవాడ(Vijayawada) ప్రభుత్వాసుపత్రిలో రెండేళ్ల బాలుడిని 15, 16 ఏళ్ల బాలిక కిడ్నాప్ చేసింది. చిన్నారి ఎత్తుకుపోతున్న ఆమెను సీసీ కెమెరా(CC Camera) దృశ్యాల ఆధారంగా పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకుని బిడ్డను తల్లి ఒడికి చేర్చారు.


బాలుడు అపహరణ
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడిని ఓ యువతి అపహరించుకునిపోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు గవర్నర్‌పేట పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. తక్షణం  రంగంలోకి దిగిన పోలీసు బృందాలు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితురాలిని కేవలం 4 గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకుని బిడ్డను తల్లికి అప్పగించారు. ఏలూరు(Eluru)కు చెందిన ఫాతిమాకు ముగ్గురు పిల్లలు ఉండగా...ఓ చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో...స్థానిక వైద్యులకు చూపించింది. మెరుగైన వైద్యం కోసం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి(Government Hospital)లో చికిత్స అందిస్తున్నారు.


ఈ క్రమంలో ఆమె భర్త రెండేళ్ల కుమారుడితో కలిసి వెయిటింగ్ హాలులో ఉన్నారు. గురువారం సాయంత్రం అనారోగ్యంగా ఉన్న చిన్నారికి పాలుపట్టేందుకు  ఆమె లోపలకి వెళ్లింది.కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూసేసరికి రెండేళ్ల కుమారుడు కనిపించలేదు. ఆందోళన చెందిన ఫాతిమా ఆస్పత్రి ఆవరణ మొత్తం వెతికింది.ఎక్కడా చిన్నారి ఆచూకీ  లభించలేదు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.


సీసీ కెమెరా సాయంతో.. 
పాత ప్రభుత్వాసుపత్రిలో చిన్నారి మాయమైనట్లు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.సీఐ సహా ఇద్దరు ఎస్‌ఐలు ఆస్పత్రికి చేరుకుని ప్రాథమిక విచారణ చేశారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.ఆస్పత్రి ఆవరణలోని సీసీ కెమెరాలు పరిశీలించగా... 15 ఏళ్ల ఓ బాలిక చిన్నారిని తీసుకుని ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో(Auto) నెంబర్‌ను ట్రాక్‌ చేసి చూడగా....ఆ యువతి చిన్నారిని తీసుకుని బెంజిసర్కిల్ వద్ద దిగినట్లు  గుర్తించారు. అక్కడ నుంచి బస్సులో కోడూరు(Koduru) వెళ్లినట్లు తెలుసుకుని అక్కడ పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు బాలుడు కోడూరు ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను గుర్తించిన బాలిక చిన్నారిని ఓ పొదల్లో పడేసింది. బాలుడి ఏడుపు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నారికి అంటిన  బురద శుభ్రం చేయించి... విజయవాడ పోలీసులకు అప్పగించారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితురాలిని కోడూరు పోలీసులు  గుర్తించారు


డబ్బు సంపాదనపై ఆశ
కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన బాలిక సులభంగా డబ్బు సంపాధించాలన్న ఆశతో కొద్దిరోజులుగా పాత ప్రభుత్వాసుపత్రి వద్ద రెక్కీ చేసింది. చిన్నారిని ఎత్తుకెళ్లి అమ్మి డబ్బుల సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. నిత్యం ఆస్పత్రి వద్దకు వచ్చి అందరితో పరిచయం పెంచుకుని పిల్లలు, పెద్దలతో మచ్చిక చేసుకుంటోంది. ఫాతిమా పిల్లలు,భర్త అందరినీ గమనిస్తూ వస్తోంది. ఆమె భర్త ఏలూరు వెళ్లాడని నిర్థరించుకుని అదును చూసి ఆమె రెండేళ్ల చిన్నారిని అపహరించుకుని వెళ్లిపోయింది.


శభాష్‌ పోలీస్
రెండేళ్ల చిన్నారి మాయమైనట్లు ఫిర్యాదు అందిన వెంటనే  విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీకెమెరాలు, ఆటోట్రాకింగ్ ఆధారంగా  నిందితురాలని గుర్తించి కేవలం 4 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోలీసుల చొరవ కారణంగానే చిన్నారికి ఎలాంటి అపాయం తలెత్తకుండా  అమ్మఒడికి చేరుకున్నాడని ప్రజలు  ప్రశంసలు కురిపిస్తున్నారు.