KCRs sister Cheeti Sakalamma passes away | హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. కొంత కాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న చీటి సకలమ్మ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సకలమ్మ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, సకలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 


కేసీఆర్‌కు అయిదో సోదరి సకలమ్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం ఆమె స్వస్థలం. కాగా, సకలమ్మ భర్త హన్మంతరావు ఇదివరకే మృతిచెందారు. ఈ దంపతులకు సంతానం ముగ్గురు కుమారులు ఉన్నారు. సకలమ్మ మరణవార్త సమాచారం అందగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత హుటాహుటిన హాస్పిటల్‌కు వెళ్లారు. సకలమ్మ అంత్యక్రియలు శనివారం నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.


బీఆర్‌ఎస్‌ నేతల సమావేశం వాయిదా
హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో శనివారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. తన మేనత్త చీటి సకలమ్మ మృతితో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఇతర ముఖ్య నేతలతో నేడు జరగాల్సిన సమావేశాన్ని కేటీఆర్ వాయిదా వేసుకున్నారని పార్టీ నేతల సమాచారం. కేసీఆర్ కుటుంబసభ్యులు సకలమ్మ అంత్యక్రియల్లో పాల్గొనున్నారు.


Also Read: Karimnagar BRS Mayor: కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు గట్టి షాక్ - బీజేపీలోకి మేయర్, పది మంది కార్పొరేటర్లు - చక్రం తిప్పిన బండి సంజయ్