Khammam News: అతను ద్విచక్ర వాహనాల చోరీ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు బేడీలు వేసినా చాకచక్యంగా తప్పించుకున్నాడు. పాత వృత్తిని వదలని ఆ దొంగ బేడీలతోనే మళ్లీ దొంగతనం చేసి తిరిగి పోలీసులకు చిక్కాడు. బేడీలతోనే మళ్లీ దొంగతనానికి వెళ్లి గ్రామస్తుల చేతికి చిక్కిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. 


నేలకొండపల్లి గ్రామానికి చెందిన కాశిబోయిన గణపతి పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల కొన్ని ద్విచక్రవాహనాలను దొంగలించడంతో పోలీసులు అతనిని పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం అతనిని స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. అయితే, పోలీసులు ఒక చేతికి బేడీలు వేసి మరోవైపు వదిలేశారు. ఇదే అదనుగా చేసుకున్న గణపతి తెల్లవారుజామున స్టేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. గణపతి కోసం పోలీసులు నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినా అతను మాత్రం దొరకలేదు.


బేడీలతోనే దొంగతనం..
నేలకొండపల్లి నుంచి తప్పించుకున్న గణపతి కూసుమంచికి చేరుకున్నాడు. చేతికి బేడీలు ఉన్నప్పటికీ వాటిని కనిపించకుండా చేసుకున్న గణపతి తిరిగి దొంగతనం కోసం చేసేందుకు పూనుకున్నాడు. కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెం గ్రామ సర్పంచ్‌ కాసాని పెద్దులు కుమారుడి వివాహం జరుగుతుండటంతో అక్కడికి వెళ్లిన గణపతి తన చేతివాటాన్ని ప్రదర్శించి అక్కడ పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాన్ని దొంగతనం చేశాడు.


Also Read: Southwest Monsoon: అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి వర్షాలు- గుడ్‌ న్యూస్ చెప్పిన ఐఎండీ


బైక్‌ చోరికీ గురైన విషయం వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేయడంతో..
తన ద్విచక్ర వాహనం చోరీకి గురికావడంతో బైక్‌ యజమాని వెంకన్న విషయాన్ని వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. నాయకన్‌గూడెంలో ద్విచక్ర వాహనం దొంగతనం చేసిన గణపతి దానిని అమ్మేందుకు ప్రయత్నించాడు. అదే మండలంలోని ఉర్లుగొండ మండలం రోడ్డులో ఓ కిరాణ దుకాణం వద్ద బైక్‌ను అమ్మేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఈ విషయం వాట్సప్‌ గ్రూప్‌లో చూసిన కిరాణ షాపు యజమాని ఉపేందర్‌ విషయాన్ని వెంకన్నకు చేరవేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న వెంకన్న అతని బందువలు గణపతిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిరిగి నేలకొండపల్లి పోలీసులు గణపతిని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


Also Read: Karate Kalyani: నడిరోడ్డుపై కరాటే కల్యాణి రచ్చ! యూట్యూబర్ చెంప పగలగొట్టి, గుడ్డలిప్పించి స్ట్రాంగ్ వార్నింగ్