Karnataka Crime News:


కర్ణాటకలో ఘటన..


రీసెంట్‌గా బలగం సినిమా చూశారుగా. అందులో నల్లి బొక్క కోసం బావ, బామ్మర్దులు గొడవ పడి 20 ఏళ్లు మాట్లాడుకోలేదనే పాయింట్‌ చూపించారు. సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో మీమ్స్ వచ్చాయి. "ఇదేం గొడవరా బాబు" అని అంతా నవ్వుకున్నారు. నిజానికి సినిమాల్లోనే కాదు. బయట కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. నాన్‌ వెజ్ విషయంలో తగాదాలు వస్తుంటాయి. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...కేవలం మాంసం విషయంలోనే గొడవలు జరిగి పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనలూ వెలుగులోకి వచ్చాయి. వీటి కోసం కొట్టుకున్న వాళ్లూ ఉన్నారు. కర్ణాటకలో ఇదే సీన్ రిపీట్ అయింది. ఇంట్లో వండిన చికెన్ అంతా ఒక్కడే తిన్నాడన్న కోపంతో ఓ తండ్రి కొడుకుని చావ బాదాడు. ఓ చెక్కతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిందీ దారుణం. మృతుడి పేరు శివరామ్‌గా పోలీసులు వెల్లడించారు. చికెన్ కర్రీ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తనకు కొంచెం కూడా మిగల్చకుండా కొడుకే అంతా తినేశాడన్న కోపంతో ఊగిపోయాడు తండ్రి. ఒక్కసారిగా మాటా మాటా పెరిగింది. చేతికి అందిన చెక్క కర్రతో గట్టిగా కొడుకు తలపై కొట్టాడు. ఆ దెబ్బ ధాటిని తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు కొడుకు. ఆసుపత్రికి తరలించగా...అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. చికెన్ కర్రీ వండలేదన్న కోపంతో ఓ భర్త, భార్యను చంపేశాడు. ఎన్ని సార్లు అడిగినా వండడం లేదన్న ఆగ్రహంతో దాడి చేసి హతమార్చాడు. "నేను ఇంటికి వచ్చే సరికి చికెన్ కర్రీ లేదు. నాకు చాలా కోపం వచ్చింది. భార్యతో వాగ్వాదం జరిగింది. కోపంతో ఆమెను గట్టిగా కొట్టాను" అని చెప్పాడు నిందితుడు. 


అమెరికాలోనూ...


అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. చికెన్ బిర్యానీ దొరక్కపోవడంతో ఒక వ్యక్తి రెస్టారెంట్ కు నిప్పు పెట్టాడు. ఈ మొత్తం సంఘటన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దాని ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ వీడియోలో నిందితుడు నిప్పు పెట్టడం చూడవచ్చు. నిందితుడి 49 ఏళ్ల చోఫెల్ నోర్బుగా గుర్తించారు పోలీసులు. న్యూయార్క్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చోఫెల్ నగరంలోని జాక్సన్ హైట్స్ ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తినడానికి వచ్చాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అతను తాగిన మైకంలో ఉన్నందున రెస్టారెంట్ సిబ్బంది తనకు చికెన్ బిర్యానీ ఇవ్వలేదని అసహనంతో రగిలిపోయాడు. అది కాస్త కోపంగా మారింది. అందుకే రెస్టారెంట్ యజమానికి గుణపాఠం చెప్పాలని భావించి ఇలా చేశాడు. తర్వాత రోజు రాత్రి రెస్టారెంట్‌కు వచ్చి నిప్పు పెట్టాడు. 






Also Read: Karnataka Elections 2023: దూకుడు మీదున్న కర్ణాటక కాంగ్రెస్, మరి కొందరి అభ్యర్థుల పేర్లు ఖరారు