హనుమాన్ జయంతి వేళ హైదరాబాద్‌లో విజయ యాత్ర జరగనుంది. విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా నేడు నగరంలోని వివిధ మార్గాలను మూసివేయనున్నారు. నేడు గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇది సికింద్రాబాద్‌ తాడ్‌ బండ్ హనుమాన్‌ దేవాలయం వరకు సాగుతుంది. ఈ సందర్భంగా ఆ మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా విజయ యాత్ర జరిగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు.


ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు


హనుమాన్​ యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 11.30 గంటల సమయంలో గౌలిగూడ రామమందిరం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా, రాత్రి 8 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ తాడ్‌బంద్ హనుమాన్‌ దేవాలయం వద్ద యాత్ర ముగియనుంది. గౌలిగూడ, పుత్లిబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్‌, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, కవాడీగూడ, బైబిల్‌ హౌస్‌, రాంగోపాల్‌ పేట్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల మీదగా తాడ్‌బంద్ దేవాలయం వరకు మొత్తం 12 కిలోమీటర్లు హనుమాన్ విజయ యాత్ర జరుగుతుంది. 


హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఇంకా సుధీర్ బాబు మాట్లాడుతూ.. సౌత్ వన్ వైపు వెళ్లేవారు కూడా ఈ రూట్ ఎలా తీసుకోవాలంటే వయా కోటి, బ్యాంక్ స్ట్రీట్, ఛాదర్ ఘాట్, బషీర్​బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్​పుర,ఫీవర్ హాస్పిటల్, చే నంబర్, అలీకే, ముసరాంబాగ్, దిల్‌సుఖ్ ననగర్ గుండా వెళ్లవచ్చని సుధీర్‌బాబు చెప్పారు. విజయ యాత్రకు 750 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారని చెప్పారు. 


ఈ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు
వాహనదారులకు సమస్యలు ఎదురైతే సామాజిక మాధ్యమాల ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్ 9010203626 ద్వారా, ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం 040 27852482 ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని సుధీర్‌ బాబు తెలిపారు. twitter.com/HYDTP, facebook.com/HYDTP ద్వారా కూడా వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్‌ అదనపు సీపీ తెలిపారు. వాహనదారులు, భక్తులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.