Harish Rao Says CPR Saves Lives: వైద్యశాస్త్ర చరిత్రలోనే అరుదైన సంఘటన తెలంగాణలో జరిగింది. నెల రోజులు కూడా నిండని చిన్నారికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు 108 సిబ్బంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో రోజుల వయసున్న బిడ్డ ప్రాణాలు కాపాడిన సిబ్బందిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించారు. వీలున్న ప్రతిచోట సీపీఆర్ పై అవగాహనా కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు మంత్రి హరీష్ తెలిపారు.
23 రోజుల బిడ్డకు సీపీఆర్ ... 108 సిబ్బంది సక్సెస్
గత కొన్ని రోజులుగా కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బుధవారం సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఊపిరి తీర్చుకున్నట్లుగా కనిపించకపోవడంతో అలర్ట్ అయిన 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ మంత్రి హరీష్ రావు 108 సిబ్బందిని ప్రశంసించారు. CPR Saves Lives అని మంత్రి హరీష్ ట్వీట్ చేశారు.
ఇటీవల చిన్న వయసులోనే ఆకస్మిక మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మార్చి 30 నాడు రెండు వేర్వేరు చోట్ల సీపీఆర్ చేసి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసిన సీఐని, 108 సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు అని ట్వీట్ చేశారు.
కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మానవత్వం చాటుకున్నారు అని మంత్రి హరీష్ రావు వారిని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. #CPR అని మంత్రి హరీష్ రావు పోస్ట్ చేశారు.
ఒకరి ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన పర్వతంరాజు డ్రైవర్ గా చేస్తున్నాడు. గురువారం చిన్నకిష్టపూర్ నుంచి కుకునూర్ పల్లికి వస్తుండగా ఆటో నడపుతున్న పర్వతంరాజుకు ఛాతీలో నొప్పి రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి 108 కి సమాచారం అందించాడు. కొండపాక 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మెడికల్ టెక్నీషియన్ మహేందర్ ఆ వ్యక్తికి సీపీఆర్ చేయగా స్పృహలోకి వచ్చాడు. మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడిన మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలెట్ రమేష్ లను అందరూ అభినందించారు.