Kadapa Crime News: కడప జిల్లాలో సంచలనం రేపిన డిగ్రీ విద్యార్థిని అనూష అనే విద్యార్ధి మిస్సింగ్, అనుమానాస్పద మృతి కేసు విచారణపై పోలీసులు వేగాన్ని పెంచారు. అయితే అనూష మృతికి ప్రేమ వ్యవహారమే కారణం అని ప్రాథమికంగా నిర్ధారణకు వ్చచినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అనూష మృతికి సంబంధించిన విషయాల గురించి తెలిపారు. అయితే మొన్న యువకులతో కలిసి కళాశాల నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి మరణానికి కారణమైన మహేష్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహేష్ అనే యువకుడు తనను తరచుగా వేధించడం, పలు ఇతర కారణాల వల్ల ఆమె నీటిలో మునిగి బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు.
బద్వేల్ లో అనూష అదృశ్యానికి సంబంధించి.. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే దర్యాప్తు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. దీనిపై ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టామని, సిద్దవఠం, నెల్లూరు, బద్వేల్ లో సీసీ టీవి ఫుటేజ్ పరిశీలించామని వివరించారు. అయితే ఈనెల 23వ తేదీన సిద్దవఠం వద్ద పెన్నా నది ఒడ్డున అనూష మృతదేహం లభ్యమైందని ఎస్పీ అన్బురాజ్ తెలిపారు. సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించామని, మృతదేహంపై ఎక్కడా ఎలాంటి గాయాలు లేవని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. అనూషది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
వైఎస్సార్ జిల్లా (YSR District) బి.కోడూరు మండలం మారాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష బద్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈనెల 20వ తేదీన రోజూలాగే కళాశాలకు వెళ్లింది. కానీ సాయంత్రం గడుస్తున్నా అమ్మాయి ఇంటికి రాలేదు. ఆమె స్నేహితులకు, కళాశాల యాజమాన్యానికి, బంధువలకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే రోజులు బాగోలేవని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని భావించిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మూడు రోజుల తరువాత సిద్ధవటం మండలం జంగాలపల్లి వద్ద పెన్నా నదిలో అనూష శవమై కనిపించింది. మృతదేహం తమ కుమార్తెదేనని అనూష తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహంపై తలపైన వెంట్రుకలు ఈడిపోయి ఉండడం, మొహానికి ఓవైపు కాలినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
దీనంతటికి బద్వేల్ మండలం పాపిరెడ్డి పల్లెకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డియే కారణం అని అనూష తల్లిదండ్రులు సిద్ధవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుమహేశ్వర్ రెడ్డి, అనూష ఇద్దరూ ఓకే కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. అయితే ఈనెల 20వ తేదీన గురు మహేశ్వర్ రెడ్డి, అనూష, మరో నలుగురు యువకులు కలిసి సిద్ధవటం కోటకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. సిద్ధవటం కోటకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీశారు.