హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో ఓ శవం సగం కాలిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా సంచలనం అయింది. కనీసం ఆనవాలు కూడా లేని విధంగా శవం కాలిపోయి ఉంది. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ కానీ, డీజిల్ గానీ పోసి శవాన్ని కాలబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. 


దగ్ధమైన మృతదేహం గురించి వివరాలను కేపీహెచ్‌బీ పోలీసులు వెల్లడించారు. హైదర్‌ నగర్‌లోని అలీతలాబ్‌ పక్కన హిందూ శ్మశాన వాటిక ఉంది. అందులో సగం కాలిన మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ సగం కాలిపోయిన శవాన్ని పరిశీలించారు. ఆ శవానికి కొంత దూరంలో చెప్పులు, ఓ సంచిని గుర్తించారు. ఆ బ్యాగును తెరిచి చూడగా ఓ రగ్గు కూడా ఉంది. ఓ బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ ఫోన్ ను కూడా పోలీసులు ఆ బ్యాగులో గుర్తించారు.


చనిపోయి పడిఉన్న వ్యక్తి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండే అవకాశం ఉంటుందని, శవాన్ని పరిశీలించిన అధికారులు తెలిపారు. ముందు అతణ్ని హత్య చేసి ఆ తర్వాత పెట్రోలు కానీ డీజిల్ కానీ దహనం చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆనవాళ్లు దొరక వద్దనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారని భావించారు. 


కేసును చేధించడం కోసం ఇటీవల నమోదైన మిస్సింగ్ వ్యక్తుల వివరాలను పరిశీలించారు. అందుకోసం ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దించారు. సైబరాబాద్‌ క్లూస్‌ టీంతో పాటు పోలీస్‌ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. 


అయితే, శ్మశానంలో శవం గుర్తించినప్పటి నుంచి పోలీసులకు లభించిన ప్రతి సాక్ష్యం అనేక అనుమానాలకు దారి తీస్తూ ఉంది. సగం కాలిన శవం ఒంటిపై భౌతిక దాడికి సంబంధించి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వచ్చాయి. అయితే, పోలీసులు వాటిని నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం కాల్చేసి చేసి ఉంటారని స్థానికులు భావిస్తుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉంటారని అనుకుంటున్నారు. పోస్టుమార్టం చేశాక వచ్చే రిపోర్టు ఆధారంగా కీలక విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. ఎవరి సన్నిహితులైనా కనిపించకుండా పోతే తమను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.


యువకుడి హత్య క్షుద్రపూజల్లో భాగంగా జరగలేదనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ హత్యకు దానికి సంబంధం ఉండదని భావిస్తున్నారు. అక్కడ దొరికిన వస్తువులను బట్టి ఆ నిర్ధారణకు వచ్చామని చెప్పారు. అక్కడి పరిసరాలలో మిస్సింగ్ కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ యువకుడి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.