Jubilee Hills Minor Girl Kidnap Case : జూబ్లీహిల్స్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన క్షణాల్లోనే పోలీసులు రంగంలోకి దిగారు. ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో పబ్‌కు వెళ్లిన బాలికను(17) కొందరు యువకులు సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ కేసులో హోంమంత్రి మనవడికి ఎటువంటి సంబంధం లేదని పోలీసుల క్లీన్ చీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. బాలిక అత్యాచారం ఘటన వార్తలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. హోంమంత్రి, డీజీపీ, సిటీ సీపీ టాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ నేతల ఆందోళన
జూబ్లీహిల్స్ బాధిత బాలికకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు జూబ్లీహిల్స్ పీఎస్ ను ముట్టడించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు ఆందోళన చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆందోళనకు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పీఎస్ ను బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎవరినో రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలికను కారులో బంధించి లైంగికదాడికి పాల్పడిన వారిని ఎందుకు అరెస్టు చేయడంలేదని బీజేపీ నేతలు నిలదీశారు. బాలికకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటామన్నారు. ఈ కేసులో ప్రజాప్రతినిధుల కుమారులు, మనువళ్లు ఉన్నందుకే కేసును నీరుగారుస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కారు దొరికినా నిందితులను పట్టుకోకపోవడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు.
కేసును నీరుగార్చేందుకే అని ఆరోపణలు
బాలికపై లైంగిక దాడి కేసులో షీ టీమ్స్ ఏమయ్యాయని ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. హోంమంత్రి మనవడి పెళ్లి సందర్భంగా పబ్‌లో పార్టీ ఇచ్చినట్లు రఘునందన్ ఆరోపించారు. హోంమంత్రి పీఏ పబ్ ముందు ఉన్న దృశ్యాలు ఉన్నారన్నారు. కేసులో నిందితుల పేర్ల స్థానంలో కారు నంబర్ ఉండడం ఏమిటని ఆయన నిలదీశారు. మే 28న లైంగికదాడి జరిగితే మే 31 వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఈ ఘటనలో నిందితులను తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ కేసులో రాజకీయ పార్టీల నేతలు ఉన్నందునే కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.