Jharkhand Congress MLAs held : ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఝార్ఖండ్ కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ నగదుతో దొరికిపోయారు. జేఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతుందని, అదే సమయంలో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగదు తరలిస్తుండగా పశ్చిమ బెంగాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నగదును సీజ్ చేసి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


బెంగాల్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు అరెస్ట్..
పశ్చిమ బెంగాల్‌లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో ప్రయాణిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో  హౌరా వద్ద ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను పోలీసులు  శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. భారీ నగదుతో ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలు పొరుగు రాష్ట్రంలో దొరకడం, అటు ఝార్ఖండ్‌తో పాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. 
పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలు పశ్చిమ బెంగాల్‌లోని రాణిహటి వద్ద ఎస్‌యూవీ వాహనంలో జాతీయ రహదారిపై వెళ్తున్నారు. ఓ కారులో పెద్ద మొత్తంలో నగదు రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని ఆపారు. ఎస్‌యూవీ వాహనం పరిశీలించగా.. నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు పంచ్లా పోలీస్ స్టేషన్ పోలీసులు. వారు ఝార్ఖండ్‌కు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారని, వారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నారని బెంగాల్ పోలీసులు తెలిపారు.


హౌరా రూరల్ ఎస్పీ స్వాతి భంగాలియా ఓ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగదు తీసుకెళ్తున్నారని సమాచారం అందింది. పోలీసులను అలర్ట్ చేయడంతో వారు సమయానికి వెళ్లి దారిలోనే వారు వెళ్తున్న ఎస్‌యూవీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించాం. నగదును లెక్కించేందుకు మనీ కౌంటింగ్ మేషీన్లను తెప్పించామని చెప్పారు. ఝార్ఖండ్ కు చెందిన ఎమ్మెల్యేలు నగదుతో బెంగాల్‌లో ఎందుకు తిరుగుతున్నారో తెలియదన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చెప్పారు.


అరెస్టయిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇర్ఫాన్‌ అన్సారీ జంతారా నుంచి గెలుపొందారు. రాంచీ జిల్లాలోని ఖిజ్రి ఎమ్మెల్యే రాజేశ్‌ కచ్చప్‌ కాగా, నమన్‌ బిక్సాల్‌ కొంగరి సిండేగ జిల్లా కొలేబిరా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలోనే నగదు పట్టుబడిందని ఎస్పీ స్వాతి భంగాలియా వెల్లడించారు. 


ఎమ్మెల్యేలకు ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని, ఏ పని కోసం నగదు తీసుకెళ్తున్నారని ఝార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం ప్రశ్నించింది. విపక్ష బీజేపీ సైతం ఆ నగదు వివరాలు త్వరగా తేల్చాలని డిమాండ్ చేసింది. హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరుగుతోందని జేఎంఎం నేతలు ఆరోపించారు. అవినీతికి పాల్పడటం, తప్పు చేస్తున్నట్లు గుర్తిస్తే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఝార్ఖండ్ కాంగ్రెస్ అధిష్టానం సైతం పశ్చిమ బెంగాల్ పోలీసులను కోరింది.
Also Read: Fact Check Shinde : ఏక్‌నాథ్ ఆటో నడిపి ఉండవచ్చు కానీ ఆ ఫోటోలో ఉన్నది మాత్రం ఆయన కాదు - వైరల్ ఫోటో వెనుక అసలు నిజం ఇదిగో