Bandi SAnjay: మీడియాతో చిట్ చాట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ఎంపికపై పలు కామెంట్లు చేశారు. మునుగోడు బై ఎలక్షన్ రావాలని అధికార టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందని బండి సంజయ్ చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం మునుగోడు ఉప ఎన్నికను వద్దు అనుకుంటోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ టీఆర్ఎస్ కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్ల కన్నా ఎక్కువ రావని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలోనూ పాగా వేస్తామని తెలిపారు. ఓల్డ్ సిటీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు.


ప్రత్యామ్నాయం  బీజేపీనే..


రాష్ట్రంలో ఇన్ని రోజులు ప్రత్యామ్నాయం లేక అందరూ అణిగి మణిగి ఉన్నారని బండి సంజయ్ అన్నారు. కానీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు కేసీఆర్ ఆటలు చెల్లబోవని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, అక్రమాలు, మాఫియాల వెనక టీఆర్ఎస్ నాయకులే ఉన్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆరోపించారు. గులాబీ నేతల వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 


పోటీ  ఎక్కడని చెప్పేది అధిష్ఠానం మాత్రమే..


తమ పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎక్కడ నిలబడాలన్నది పార్టీనే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు బండి సంజయ్. సొంతంగా ప్రకటించుకునే సంప్రదాయం పార్టీలో లేదని గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో  మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ప్రస్తుత హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కేసీఆర్ పై పోటీకి దిగుతానంటూ కామెంట్లు చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి.. తనను ఓడిస్తానని అన్నారు ఈటల. కేసీఆర్ పై ఎన్నికల్లో పోటీకి నిలబడతానని పదే పదే చెబుతున్నారు. హుజూరాబాద్, గజ్వేల్ లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా పర్లేదు అని సవాల్ విసిరారు. కేసీఆర్ ను ఓడగొట్టడమే తన లక్ష్యమని ఈటల అన్నారు. ఒకవైపు ఈటల గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానంటుంటే.. ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.


మాకు వారే బాస్ లు..


బీజేపీ పార్టీకి, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలే బాస్ లని చెప్పారు బండి సంజయ్. వారి నాయకత్వంలోనే పార్టీని బలోపేతం చేస్తూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై త్వరలో వివేక్ ఆధ్వర్యంలో ఢిల్లీకి బృందం వెళ్తుందని చెప్పారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతిపై కేంద్ర జలశక్తి మంత్రికి కంప్లైంట్ ఇస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్ చెప్పారు.