Lover Thief: అతడో ప్రేమ గాడు. తరచూ మోసాలు చేస్తూ అందరిని ముంచే వాడిని మోసగాడు అని ఎలా అంటారో.. ప్రేమ కోసం ప్రేమించిన ప్రియురాలి కోసం ఏదైనా చేసే వాడిని ప్రేమ గాడు అంటారు. ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టాడు షాజహాన్. ప్రేమ కోసం ప్రేమికురాలినే దూరం చేసుకున్నాడు దేవదాస్. వాళ్ల నుండే ప్రేమించడాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు ఈ వ్యక్తి. తన ప్రేమ కలకాలం నిలిచిపోతుందని కలలు కన్నాడు.
ప్రేమ కోసం ఏదైనా చేయగల సమర్థుడు..
అతడు అందరి లాంటి ప్రేమికుడు కాదు. తన ప్రేమ కోసం ఏదైనా చేయడానికి అతడు ఎప్పుడూ వెనకాడడు. ప్రేయసిని సంతోష పెట్టేందుకు ఏ పని అయినా చేసే స్వభావం అతడిది. తన ప్రియురాలిని సంతోషంగా చూసుకోవడమే తనకు కావాల్సింది. దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ పనే చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు. ప్రేమ కోసం, ప్రియురాలి కోసం అతడు చేసిన పని ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది..?
ఈనెల 22వ తేదీన బెంగళూరులోని జేపీ నగర క్రోమా స్టోర్ లో దొంగతనం జరిగింది. అబ్దుల్ మునాఫ్ అనే వ్యక్తి ఆ దొంగతనానికి పాల్పడ్డాడు. క్రోమా స్టోర్ నుండి ఫోన్లను దొంగలించాడు అబ్దుల్ మునాఫ్. వాటి విలువ దాదాపు రూ. 5 లక్షలు ఉంటుందని స్టోర్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు.
దొంగతనం ఎలా చేశాడంటే..?
ఈ నెల 22వ తేదీన అబ్దుల్ మునాఫ్ క్రోమా స్టోర్ కు వెళ్లాడు. ఏదో కొనుగోలు చేసే వాడిలా స్టోర్ లోకి అడుగు పెట్టాడు. తర్వాత టాయిలెట్ కు వెళ్లాడు. కానీ ఎంతకూ బయటకు రాలేదు. అబ్దుల్ మునాఫ్ టాయిలెట్ లో ఉన్నాడన్న విషయం స్టోర్ నిర్వాహకులకు తెలియదు. ఎప్పట్లాగే రాత్రి కాగానే స్టోర్ మూసేశారు. నిర్వాహకలు, సిబ్బంది ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయారు. స్టోర్ మూసేశారని గమనించి అబ్దుల్ మునాఫ్ బాత్రూం నుండి బయటకు వచ్చాడు. అతడు అనుకున్నట్టుగానే స్టోర్ లో ఎవరూ లేరు. ఇక చేతి వాటం ప్రదర్శించడం ప్రారంభించాడు. లక్షలాది రూపాయలు విలువ చేసే ఫోన్లను దొంగలించాలని అనుకున్నాడు. ఓ 6 ఫోన్లను తీసుకున్నాడు. తర్వాత మళ్లీ బాత్రూంకు వెళ్లి తెల్లారే వరకు అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం స్టోర్ తెరవగానే బాత్రూం నుండి బయటకు వచ్చి మరో డోర్ నుండి మెల్లిగా జారుకున్నాడు.
సీసీటీవీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు..
మరుసటి రోజు స్టోర్ కు వచ్చిన సిబ్బందికి ఫోన్లు కనిపించేదు. ఫోన్లు మిస్ అయినట్లు గమనించారు. స్టోర్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అబ్దుల్ మునాఫ్ చేసిన దొంగతనం కళ్లకు కట్టినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దానిని స్టోర్ నిర్వాహకులు చూశారు. తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను సేకరించి విచారణ మొదలు పెట్టారు.
గొప్ప ప్రేమికుడే కానీ.. నైపుణ్యమున్న దొంగ కాదు..
అబ్దుల్ మునాఫ్ కు ఇదే మొదటి దొంగతనం. చోరీ అయితే విజయవంతంగా చేశాడు కానీ.. ఎక్కువ కాలం దాక్కుని ఉండలేకపోయాడు. తను వదిలిన క్లూస్ తో పోలీసులు ఇట్టే పట్టేసుకున్నారు. అతడి నుండి 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే తన ప్రియురాలికి కానుకగా ఇచ్చేందుకే దొంగతనం చేశానని పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు ఈ అద్భుత ప్రేమగాడు.