న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతో మంది దొంగలున్నారు అతడే అతిపెద్ద దొంగ అనడానికి పోలీసులు పలు కారణాలు వెల్లడించారు. అనిల్ చౌహాన్ అనే వ్యక్తి 27 ఏళ్లలో 5000కు పైగా కార్లను దొంగిలించాడు. ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాపర్టీస్ కొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేస్తూ వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఢిల్లీ పోలీసులు ఈ గజ దొంగ కేసు వివరాలు వెల్లడించారు.
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం..
52 ఏళ్ల అనిల్ చౌహాన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగా 27 ఏళ్ల కిందట కార్ల చోరీని సైతం మొదలుపెట్టాడు అనిల్ చౌహాన్. ఈ క్రమంలో 5000కు పైగా కార్లును అతడు మరికొందరి సాయంతో చోరీ చేశాడు. పలు కేసులు విచారణ చేపట్టిన ఢిల్లీ సెంట్రల్ పోలీసులు నిఘా ఉంచారు. ఢిల్లీలోని దేశ్ బంధు గుప్తారోడ్డులోని నివాసంలో ఉండగా అక్కడికి వెళ్లిన పోలీస్ టీమ్ అనిల్ చౌహాన్‌ను అరెస్ట్ చేసింది. దేశంలోనే పెద్ద కార్ల దొంగను అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. అతడు కార్ల చోరీతో పాటు మారణాయుధాలు సైతం సగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలు, కేసులు ఉన్నాయి.
దొంగిలించిన కార్లు విదేశాలకు సైతం..
1995లో ఢిల్లీలోని కాన్‌పూర్ ఏరియాలో ఉన్న అనిల్ చౌహాన్ ఆటో నడుపుతూ జీవించేవాడు. కార్ల చోరీ మొదలుపెట్టి తక్కువ సమయంలోనే మారుతి 800 కార్లు పెద్ద సంఖ్యలో దొంగిలించాడు. పలు రాష్ట్రాల్లో కార్లు చోరీ చేసి వాటిని జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలతో పాటు విదేశాలకు పంపించేవాడు. తన చోరీలలో భాగంగా కొందరు క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లను సైతం నిందితుడు అనిల్ చౌహాన్ హత్య చేశాడు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు అరెస్ట్.. 5 ఏళ్లు జైళ్లోనే
గతంలోనూ పలు కేసులలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లొచ్చాడు. ఆయన ప్రవర్తన మారలేదు. 2015లో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు అరెస్టయ్యాడు. 5 సంవత్సరాలు జైలులోనే గడిపిన అనిల్ 2020లో విడుదల అయ్యాడు. అతడిపై ఇప్పటివరకూ 180 కేసులు నమోదయ్యాయి. అందులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదుచేసిన మనీ లాండరింగ్ కేసు కూడా ఉంది.
గజ దొంగకు ముగ్గురు భార్యలు.. ఏడుగురు పిల్లలు
నిందితుడు అనిల్ చౌహాన్‌కు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారి నుంచి అతడికి సంతానం ఏడుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అసోం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. కార్లు అమ్మగా వచ్చిన సొమ్ముతో ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టాడు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీకి తిరిగొచ్చిన అనిల్ చౌహాన్‌ను ఢిల్లీ సెంట్రల్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.
కార్ల చోరీతో పాటు అక్రమంగా ఆయుధ సరఫరా చేస్తున్నాడు. కొన్ని నిషేధిత సంస్థలకు ఆయుధాలను సరఫరా చేస్తున్న కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. పాత కేసులను సైతం రీ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.