Fake Finger Prints Case :   శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లుగా .. దొంగబుద్ది  ఉన్న వాళ్లకు దోచుకోవడానికి ఎన్నో రకాల ఐడియాలు పుట్టుకొస్తూ ఉంటాయి. తాజాగా ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తయారుచేసి  లేని మనుషుల్ని ఉన్నట్లుగా చూపించడమే కాదు వారు ఉద్యోగం కూడా చేస్తున్నారన్నట్లుగా సృష్టించివారి జీతాలు కూడా తీసుకుంటున్నారు కొంత మంది ప్రబుద్దులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో వెలుగు  చూసిన ఈ బాగోతం కలకలం రేపుతోంది. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరెడ్డితో పాటు ఇద్దరిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. 


పని చేయని వాళ్లతో ఫీల్డ్‌లో ధంబ్ వేయించడానికి ఫింగర్ ప్రింట్ల తయారీ ! 


ప్రస్తుతం ఈ కేసును టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది.   ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేసి కృత్రిమ వేలిముద్రలు తయారీ చేసినట్లు   పోలీసులు గుర్తించారు. యూట్యూబ్ లో చూసి  ఫెవికాల్, ఎమ్ సీల్ మిక్స్ చేస్తే వచ్చిన సింథటిక్ లాంటి పదార్థాన్ని తమతో పాటు ఫీల్డ్ లోకి తీసుకెళ్లి పంచింగ్ చేస్తున్నట్లుగాగుర్తించారు. మొత్తం వారి వద్ద నుంచి  21 కృత్రిమ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు.  త్వరలో అసలు సూత్రధారులేవరో బయటపెడతామని  టాస్క్ఫోర్స్ పోలీసులు  చెబుతున్నారు.  జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులు విధులకు రాకున్నా.. వారి వేలి ముద్రలతో తయారుచేసిన సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో హాజరు వేస్తున్నారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ బంధువులను ఇలా వర్కర్లుగా చేర్చి.. వారి పింగర్ ప్రింట్లతో మాయ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 


ఫేక్ ఫింగర్ ప్రింట్లతో జీతాలు కాజేస్తున్న శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు 


పారిశుధ్య కార్మికుల హాజరు కోసం బయోమెట్రిక్‌ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినా అవకతవక లు జరుగుతున్నాయి.    సంబంధిత మనుషులు లేకుండా వారి వేలిముద్రలతో హాజరు వేసే నయా పరిజ్ఞానానికి ఎస్‌ఎ్‌ఫఏలో చేస్తోన్న ఖర్చు అత్యల్పం. కేవలం రూ.5తోనే సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. ఎవరికి వారే వీటిని తయారు చేసుకుంటున్నారు.  కొవ్వత్తిని వెలిగించి దాని నుంచి వచ్చే ద్రావకాన్ని ప్లేట్‌/కింద పోస్తారు. చల్లారిన అనంతరం గట్టి పడక ముందే అందులో వేలిముద్ర వేస్తారు. దానిపై ఫెవికాల్‌ పోస్తే సింథటిక్‌ వేలి ముద్ర రెడీ అయినట్టే. ఒక్కసారి తయారుచేసే సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ నమూనాను కొన్ని నెలలపాటు వినియోగించవచ్చు.  కార్మికుడు స్వయంగా వేలిముద్ర వేసినట్టే సింథటిక్‌ పింగర్‌ ప్రింట్‌ నమూనాతో హాజరు పడుతుంది.
 


గతంలోనూ ఇలాంటి స్కాంలు బయట పడ్డాయి  !


గ్రేటర్‌లో 18 వేల మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో  విధులకు రాకుండా హాజరు వేయించుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.   పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాల్సిన కొందరు ఏఎంఓహెచ్‌లే వారికి సహకరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫింగర్ ప్రింట్ల స్కాం బయటపడటం ఇదే మొదటి సారి కాదు. ఐదేళ్ల కిందటే వెలుగు చూసింది. అప్పట్లో కొంత మందిని అరెస్ట్ చేశారు కూడా. కానీ మళ్లీ మళ్లీ ఇలాంటి స్కాం జరుగుతూనే ఉంది.