Hyderbad News: హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇటీవల బైక్ స్టంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా అర్థరాత్రిళ్లు చాలా మంది యువకులు.. అక్కడి రోడ్లపై ప్రమాదకర రీతిలో బైకులతో స్టంట్లు చేస్తున్నారు. నిల్చొని, బైకును వదిలేసి, ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకొని.. ఇలా తమకు నచ్చినట్లుగా సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువకుడు ఇలాగే సామాజికి మాధ్యమాల్లో లైకుల కోసం బైకుపై స్టంట్లు చేశాడు. సీసీ కెమెరాల ద్వారా విషయం గుర్తించిన ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. వాహనం నెంబర్ సాయంతో యువకుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మరీ అతడిపై కేసు నమోదు చేశారు. ఇంకోసారి ఇలా చేయొద్దంటూ అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ యువకుడితోనే.. మరోసారి నేను ఇలా చేయను.. ఇంకెవరు స్టంట్లు చేయొద్దని కోరుతున్నానంటూ అందరికీ చెప్పించారు. 


లైకులు, ఎంజాయ్ మెంట్ వంటి వాటి కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయరాదని పోలీసులు చెబుతున్నారు. ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్నారు. ఇలా స్టంట్లు చేయడం వల్ల చేసే వారితో పాటు అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. సీసీ కెమెరాల్లో ప్రతీది రికార్డు అవుతుందని... బైకులతో స్టంట్లు చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకనుంచి ఎవరు కూడా ఇలా చేయకూడదని పేర్కొన్నారు. 


ఇటీవల ముంబయిలోనూ ఇలాంటి ఘటనే


అయితే తాజాగా ముంబయిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు ముందూ వెనక అమ్మాయిలను కూర్చోబెట్టుకొని...  బైక్ పై స్టంట్లు చేశాడు. దీన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా... వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన ముంబయి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఈ బైక్ రైడ్ ఎక్కడ జరిగిందో గుర్తించారు.  అలాగే ప్రమాదకరంగా స్టంట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసులు బైక్ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


బైక్ పై ఇద్దరు అమ్మాయిలతో స్టంట్


బైక్‌పై స్టంట్ చేస్తున్న వ్యక్తిని ఆంటోప్ హిల్‌కు చెందిన ఫయాజ్ ఖాద్రీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అతను బైక్‌పై విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతనితో మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై విన్యాసాలు చేస్తున్న సమయంలో ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించలేదు. ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలను కూడా పాటించలేదు. బైక్‌పై ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఓ వ్యక్తి విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో.. సామాజిక సేవల కోసం పని చేస్తున్న 'పోథోల్ వారియర్స్' అనే సంస్థ ట్వీట్ చేయడం ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతను ప్రమాదకర విన్యాసాలు చేయడమే కాకుండా.. యువతను ప్రేరేపించేలా చేస్తున్నాడని కూడా పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ, మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.