- మేడ్చల్ లో ట్రాఫిక్ హోంగార్డు పైకి దూసుకెళ్లిన లారీ
- తీవ్ర గాయాలతో హోంగార్డు అక్కడికక్కడే మృతి
- సీసీ కెమెరాలో రికార్డయిన ఘటన


మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్యూటీలో ఉన్న హోంగార్డు పైనుంచి లారీ కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ జాతీయ రహదారి 44 కండ్లకోయ జంక్షన్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలు తనిఖీ చేస్తున్న హోంగార్డు శ్రీనివాస్(35) మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.


అసలేం జరిగిందంటే..
ట్రాఫిక్ హోంగార్డు శ్రీనివాస్ రోజులాగానే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్ల కోయాలో డ్యూటీ చేస్తున్నాడు. వాహనాలను గమనిస్తూ ఉన్న శ్రీనివాస్ అటువైటుగా కంటైనర్ రావడంతో ఆ వైపుగా వెళ్లాడు. కంటైనర్ పై అనుమానం వచ్చి ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో లారీ శ్రీనివాస్ పై నుంచి వాహనాన్ని తీసుకెళ్లాడు. కంటైనర్ ను చెక్ చేసేందుకు ఆపే ప్రయత్నం చేసిన హోంగార్డుపై నుంచి భారీ వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు పరుగున వచ్చి హోంగార్డును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. 


కేసు నమోదు చేసిన పోలీసులు
డ్యూటీ చేస్తూ తనిఖీల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు శ్రీనివాస్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన తరువాత అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్ ను సీజ్ చేసి చెక్ చేస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ కావాలనే హోంగార్డు నుంచి తప్పించుకునేందుకు వాహనం అలా నడిపాడా, లేక కంటైనర్ లో ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.


కల్వర్టును ఢీకొన్న చేర్యాల సీఐ కారు...
కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొనడంతో సీఐ ప్రమాదానికి గురైన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల సీఐ మంచినీళ్ళ శ్రీనివాస్ చేర్యాల నుంచి వరంగల్ వెళ్తుండగా ముస్త్యాల గ్రామ శివారులో క్రాసింగ్ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా సీఐ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి సీఐ మంచినీళ్ళ శ్రీనివాస్ ను తరలించారు.