Hyderabad News : పంజాగుట్ట వివాహితపై హత్యాయత్నం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే పీఏ విజయ్ సింహ గొంతు కోసినట్లు మహిళ డ్రామా ఆడారని పోలీసులు తేల్చారు. విజయ్ సింహను కేసులో ఇరికిచేందుకు ఆరోపణలు చేశారని పోలీసులు గుర్తించారు. బాధితురాలు నిషా యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఒంటిపై ఎలాంటి కత్తిగాట్లు లేనట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ విషయంపై తాజాగా నిషా మరో వీడియో విడుదల చేశారు. తనను విజయ్ సింహ ఎంతగానో వేధించారని, పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై అపోహలు సృష్టిస్తున్నారని వీడియోలో ఆరోపించారు. విజయ్ సింహ చేతిలో బాధను అనువించానన్నారు. పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని వీడియోలో తెలిపారు.  


ఆ కార్పొరేటర్ కుట్ర 


ఈ ఘటనపై విజయ్ కూడా స్పందించారు. మహిళపై హత్యాయత్నం జరిగిన సమయంలో తాను తన ఇంట్లో ఉన్నానని చెప్పారు. టీఆర్ఎస్ లో చురుగ్గా ఉంటున్నానని తనపై ఈ కుట్ర చేశారని ఆరోపించారు. గతంలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ దగ్గర పని చేశానని, బాబా ఫసియుద్దిన్‌ మోసాలు తెలిసి దూరంగా ఉన్నానని విజయ్ అన్నారు. గతంలో బాబా ఫసీయుద్దిన్‌ ఓ మహిళతో తనపై కేసు పెట్టించారని చెప్పారు. పోలీసుల విచారణలో అన్ని నిజాలు తేలతాయని అన్నారు. బాబా ఫసీయుద్దీన్ గురించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. బాధిత మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమని తెలియజేశారు. వారం రోజుల క్రితం బాధిత మహిళ భర్త తనను కలిశారని కూడా చెప్పారు. తనను ఏదైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూరజ్‌ అనే వ్యక్తి చెప్పారని విజయ్ వెల్లడించారు.


అసలేం జరిగింది? 


జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ సింహ తన భార్యపై దాడి చేసి గొంతు కోశాడని వివాహిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన విజయ్, న్యూడ్ కాల్స్ చేసి మహిళను వేధించడారని ఆరోపించారు. ఆదివారం రాత్రి మహిళ ఇంటికి వెళ్లి విజయ్ బలవంతం చేశాడని, అందుకు మహిళ ఒప్పుకోకపోడంతో  ఆవేశంతో  బీర్ బాటిల్‌తో మహిళపై దాడి చేశాడని ఆమె భర్త తెలిపారు.  నిందితుడు విజయ్ ఎమ్మెల్యే పీఏ కావడంతో పోలీసులు పట్టించుకోవటం లేదని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహిళ భర్త మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. ఎమ్మెల్యే పీఏ విజయ్‌ సింహా తన భార్యతో తరచూ ఫోన్ లో మాట్లడేవాడని చెప్పారు. ఆమెతో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్‌లో న్యూడ్‌ వీడియో కాల్స్‌, ఫోన్‌ కాల్స్‌ కూడా చేసేవాడని చెప్పారు. కాల్స్‌కు సంబంధించిన ఫోన్‌ రికార్డ్స్‌ అన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆమెతో తొలుత స్నేహంగానే ఉన్నాడని చెప్పారు. ఇలా ఏకంగా తమ ఇంటి అడ్రస్‌ తెలుసుకుని వచ్చి దాడి చేస్తాడని అనుకోలేదని అన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్పందించారు. విజయ్​ తన పీఏ కాదని గతంలో ఓ కార్పొరేటర్ దగ్గర పని చేశాడని చెప్పారు.


Also Read : ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం- పెరటితోటలో వెరైటీ సాగు


Also Read : కొముర భీం జిల్లాలో విషాదం, కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసిన ఐదేళ్ల చిన్నారి!