ఇప్పటి వరకు గంజాయి రవాణా ద్వారా మాత్రమే నెల్లూరు వార్తల్లోకెక్కింది. కానీ తొలిసారిగా నెల్లూరు గంజాయి మొక్కల పెంపకానికి కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇన్నాళ్లూ మన్యం గంజాయి వనం అనుకున్నారు కానీ, ఇలా పట్టణాల్లో కూడా అందులోనూ ఇంటిలోనే గంజాయిని పెంచుతారని ఎవరూ ఊహించలేదు. అసలు పోలీసులు వచ్చి చూసే వరకు ఆ చుట్టుపక్కలవారికి కూడా అవి గంజాయి మొక్కలని తెలియవు. అంత పగడ్బందీగా గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడు నెల్లూరు వాసి. 


గంజాయి మొక్కల పెంపకం ఎక్కడో మారుమూల గుట్టుచప్పుడు కాకుండా చేసే వ్యవహారం. గంజాయి రవాణా కూడా అలాగే జరుగుతుంది. కానీ నెల్లూరులో ఓ వ్యక్తి మాత్రం దర్జాగా పెరటి తోటలాగా గంజాయి మొక్కల్ని పెంచుతున్నాడు. నెల్లూరు, జనార్ధన్ రెడ్డి కాల‌నీలో  గంజాయి మొక్క పెంప‌కం చూసి సెబ్ అధికారులే షాకయ్యారు. జ‌నార్ధ‌న్ రెడ్డి కాల‌నీలో స‌య్య‌ద్ రవూఫ్ ఇంట్లో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ విషయం తెలుసుకున్న సెబ్ అధికారులు రవూఫ్ ఇంటిలో సోదాలు చేపట్టారు. పెరటిలోనే ఏపుగా గంజాయి పెరగడం చూసి మొక్కల్ని తొలగించారు. వాటిని స్వాధీనం చేసుకుని రవూఫ్ పై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టార. నెల్లూరులోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలా గంజాయి సాగు చేస్తున్నారేమోనని ఆరా తీస్తున్నారు. రవూఫ్ ఇంటిలో ఉన్న గంజాయి మొక్కల్ని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవూఫ్ ని అదుపులోకి తీసుకున్నారు. 


ఇటీవల కాలంలో నెల్లూరు సెబ్ పోలీసులు అక్రమ మద్యం, గుట్కాపై ఎక్కువ ఫోకస్ పెంచారు. గంజాయి రవాణాపై కూడా దృష్టిపెట్టారు. విశాఖ నుంచి నెల్లూరుమీదుగా గంజాయి సరఫరా చేసే క్రమంలో చాలా సార్లు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో గంజాయి ప్యాకెట్లు లభించిన ఉదాహరణలున్నాయి. అలా గంజాయి రవాణా విషయంలో చాలాసార్లు నెల్లూరు పేరు వినపడింది. కానీ ఇలా గంజాయి పెంపకం ద్వారా ఎప్పుడూ నెల్లూరు పేరు వార్తల్లోకెక్కలేదు. 


అసలీ మొక్కలు ఎక్కడివి..?
రవూఫ్ దగ్గరకు గంజాయి మొక్కలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు సెబ్ అధికారులు. గంజాయి మొక్కల్ని కావాలనే పెంచాడా, లేక ఇంట్లో పెంచితే ఏం పర్లేదని అనుకున్నాడా..? ఇప్పటి వరకు గంజాయి ఆకుల్ని రవూఫ్ ఏంచేశాడనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు నడిబొడ్డున ఇలా గంజాయి మొక్కలు బయటపడేసరికి పోలీసులు సైతం షాకయ్యారు. 


గంజాయి తోటల్లో సాగుచేసినా, ఇంట్లో పెంచినా నేరమేనంటున్నారు పోలీసులు. గంజాయిని సాగు చేసినా, ఆ మొక్కల్ని, ఎండబెట్టిన గంజాయి ఆకుల్ని ఇంటిలో ఉంచుకున్నా కూడా నేరమే. అందుకే పోలీసులు ఇప్పుడు రవూఫ్ ని కార్నర్ చేశారు. గంజాయి మొక్కల్ని ఇలా పెంచడం నేరం అని చెబుతూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. 


గంజాయి ఎంత చిన్న మొత్తంలో దొరికినా అది నేరమే, అదే సమయంలో గంజాయి మొక్కలు ఎంత తక్కువ సంఖ్యలో పెంచినా నేరం తీవ్రత తగ్గదు. అందుకే సెబ్ అధికారులు జాగ్రత్తగా గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు.