Suryapet Rape: హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ అత్యాచారం కేసు నమోదైంది. బస్సు వేగంగా వెళ్తుండగా అందులో ఏకంగా డ్రైవరే తనపై అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు కూకట్ పల్లి (Kukatpally) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు దౌర్జన్యం కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే, కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డం అనేది సంచలనంగా మారింది.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కదులుతున్న స్లీపర్ క్లాసుకు చెందిన ఓ ప్రైవేటు బస్సులో (Private Buses) ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్‌ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను కత్తితో బెదిరించి మరీ ఈ అఘాయిత్యం చేశాడు. తోటి ప్రయాణికులు అంతా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఈ పని చేశాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని కూకట్‌ పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల వివాహిత హైదరాబాద్‌లో చిన్న పిల్లల సంరక్షకురాలిగా పని చేస్తున్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. మాదాపూర్‌ (Madapur) ప్రాంతంలో వారితో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్తతో గతంలో విడిపోవడంతో అతను వేరుగా ఉంటున్నాడు. 


మహిళ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘సొంతూరికి వెళ్లేందుకు ఫిబ్రవరి 23న కూకట్‌ పల్లిలో ప్రైవేటు స్లీపర్ బస్సు ఎక్కాను. నాకు చివరి స్లీపర్ బెర్తు కేటాయించారు. బస్సులో మిగతా ప్రయాణికులు కూడా ఉన్నారు. నేను నిద్రపోతుండగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో డ్రైవర్‌ రాజేశ్‌ (35) నా దగ్గరకు వచ్చాడు. అదే సమయంలో బస్సు సూర్యాపేట దాటింది. మరో డ్రైవర్‌ బస్సు నడుపుతున్నాడు. రాజేశ్‌ కత్తితో బెదిరించి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 


24న ఉదయం మా ఊరు వచ్చిందని బస్సు దిగుతుండగా నన్ను బెదిరించి రూ.7 వేలు తీసుకున్నాడు. రాత్రి జరిగిన విషయం బహిర్గతం చేస్తానంటూ బెదిరించాడ’’ని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం (ఫిబ్రవరి 26) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రేప్, దౌర్జన్యం కేసులు నమోదు చేసినట్లు కూకట్ పల్లి పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, బాధితురాలి బంధువులు కూడా ఆమెకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వారు గవర్నర్‌ తమిళి సౌందరరాజన్ కాన్వాయ్‌ను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి హాజరై గవర్నర్ తిరిగివెళ్తుండగా.. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.