Tirumala Tirupati Devstanam: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రంలో క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం భక్తులు పరితప్పించి పోతుంటారు. ప్రతినిత్యం దేశ విదేశాల నుండి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. కలియుగ నాథుడి దర్శన కోసం ఎన్నో వ్యయప్రయాసలకులోనై వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటారు. గంటల తరబడి క్యూలైన్స్ లో వేచి ఉంచి మరి స్వామి వారి దర్శించుకుంటారు. స్వామి వారిని దర్శించుకుంటే చాలు తాము చేసిన పాపాలు అన్ని తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది అంతా టీటీడీలో కోవిడ్ వ్యాప్తి కాక ముందు వరకూ జరిగే దర్శన విధి విధానాలు. అయితే కొవిడ్ వ్యాప్తి తరువాత ఇందుకు బిన్నంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ వస్తుంది టీటీడీ. ఇదే విధంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో టిక్కెట్లు ఉన్న భక్తులను‌ మాత్రమే కొండకు అనుమతిస్తూ వస్తొంది టీటీడీ.  


కోవిడ్ నిబంధనల మేరకు తక్కువ మందినే తిరుమలకు అనుమతిస్తున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతి సమయాన్ని కూడా కుదించింది టీటీడీ. కోవిడ్ వ్యాప్తి పూర్తి స్ధాయిలో తగ్గు ముఖం పట్టడంతో గత పాలక మండలి సమావేశంలో భక్తుల సంఖ్య పెంపుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీంతో దర్శన టోకెన్ల సంఖ్యను పెంచింది టీటీడీ. ఈ క్రమంలోనే ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతి సమయంను కూడా టీటీడీ మార్పు చేసింది. అంతే కాకుండా భక్తుల పెరుగుతున్న సమయంలో భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు, టీటీడీ పెట్టిన షరతులను పాటించాలని కోరుతుంది.


ఇకపై భక్తులు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే (TTD New Rules)
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు ఉంటేనే అలిపిరి తనిఖీ కేంద్రం, నడకదారి వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండకు అనుమతించనుంది. అంతే కాకుండా కోవిడ్ నిబంధనలు మేరకు ప్రతి భక్తుడు మాస్క్ ధరించి ఉంటేనే కొండకు అనుమతించనున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్ లు తీసుకెళ్ళరాదని సూచించారు.‌ అంతేకాకుండా తిరుమలలో నిషేధిత వస్తువులైన మాంసం, మద్యం, బీడీలు, సిగెరెట్లు తదితర పొగాకు సంబందిత వస్తువులు పూర్తిగా నిషేధించిన కారణంగా కనుక భక్తులు ఎవరూ తమ వెంట సదరు వస్తువులను తీసుకొని రాకూడని హెచ్చరించారు.


ఘాట్ రోడ్డు అనుమతి సమయాలు ఇవీ (Tirumala Ghat Road Timings)
శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కువ శాతం సొంత వాహానాల్లో, బాడుగ వాహనాల్లో వస్తుంటారు. దీంతో ఎల్లప్పుడూ తిరుమల ఘాట్ రోడ్డులో (Tirumala Ghat Road) వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిలో పూర్తి స్థాయిలో మార్పు చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుండి ఉదయం 3 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు, ద్విచక్ర వాహనాలను ఉదయం 4 గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు అనుమతించడమే కాకుండా హెల్మెట్ తప్పని సరిగా ధరించి రావాలని టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డులో ప్రయాణ సమయంలో అతివేగం ప్రమాదకరం కావడంతో భక్తులు అందరూ నిదానంగానే ప్రయాణించాలని సూచించింది టీటీడీ.


సామాన్య భక్తుల కోసం మరో కీలక నిర్ణయం
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యం ఇచ్చేలా శుక్ర, శని, ఆది వారాల్లో  వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshan) రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఇక శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టోకన్లు జారి చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకెన్లు టీటీడీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సర్వదర్శన భక్తుల సౌకర్యార్ధం రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.