ఉక్రెయిన్‌లో రష్యన్ బాంబులు పేలుతుంటే తెలుగు రాష్ట్రాల్లో కొందరి కన్నవారి గుండెలు బరువెక్కుతున్నాయి. అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు. 


వైద్య విద్యకు కేరాఫ్‌ అడ్రస్‌


వైద్య విద్యకు మన దేశంలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడి కాంపిటీషన్ తట్టుకొని సీటు దక్కించుకొన వైద్య విద్య పూర్తి చేయాలంటే చాలా మంది విద్యార్థులకు అంత ఈజీ కాదు. ఇక్కడ అవకాశాలు దొరకని చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి వైద్యవిద్యను అభ్యసిస్తుంటారు. అలాంటి దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. 


ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు


దేశవ్యాప్తంగా సుమారు ఇరవై వేలమందికిపైగా విద్యార్థులు ఇప్పుడు ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇన్నాళ్లూ సాఫీగా సాగిన వాళ్ల చదువులు ఇప్పుడు గందరగోళంలో పడ్డాయి. రష్యా, ఉక్రెయిన్‌ వార్‌ వాళ్లను టెన్షన్ పెడుతోంది. అక్కడి పరిస్థితులు దిగజారుతున్న టైంలో ఎలాగైనా బయటపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు చాలమంది ఉన్నారు. తమను క్షేమంగా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. తల్లిదండ్రులకు, ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్స్ చేసి రిక్వస్ట్‌లు చేస్తున్నారు. 


అన్ని జిల్లాల నుంచి బాధితులు


ఒకట్రెండు జిల్లాలు కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని నలుమూలల నుంచి వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. ఇప్పుడు వాళ్లను రప్పించడానికి ప్రభుత్వాలు, తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు వీడియో కాల్స్ చేసి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి కొందరి పరిస్థితి బాగానే ఉన్నా అక్కడ ఎక్కువ రోజులు ఉండటం అంత మంచిది కాదని భావిస్తున్నారు. అందుకే వీలైన త్వరగా బయటపడాలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు.   


తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పరిసర ప్రాంతాల నుంచి సుమారు 20 మందికి పైగా విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. తమను త్వరగా ఇండియా తీసుకురావాలని సెల్ఫీ వీడియోలతో  ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నారు. ఉప్పలగుప్తం మండలం విలసవిల్లికి చెందిన భవ్య సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపించారు.తమతోపాటు సుమారు 20 మందికిపైగా ఉన్నామని అందరిని తీసుకెళ్ళాలని రిక్వస్ట్ చేశారు. 


మరికొందరు తాము క్షేమంగా ఉన్నామంటూ వీడియో కాల్స్ చేస్తున్నారు. నిత్యం వీడియోకాల్స్ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి ప‌లువురు విద్యార్థులు వెళ్లారు. అందులో మంచిర్యాల సీఐ కుమారుడు అఖిల్‌ కూడా ఉన్నాడు. నారాయణ్ నాయక్ రెండో కుమారుడు ఎంబీబీఎస్ చదివేందుకు రెండు నెలల కింద‌టే వెళ్లాడు. కంగారు పడుతున్న తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసిన అఖిల్‌ తాను క్షేమంగానే ఉన్నానని బెంగ పెట్టుకోవద్ద‌ని సూచించాడు. ఆ కాల్‌లో సీఐ నారాయ‌ణ్ నాయ‌క్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. దాడులు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాన జరుగుతతోందని తామంతా పడమర ప్రాంతం వైపున ఉన్నట్టు అఖిల్ చెప్పాడు. 


సింగ‌రేణి కార్మికుడి కూతురు..


మంద‌న‌పు స్ఫూర్తి ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చ‌దువుతోంది. ఆమె ఫ్యామిలీ తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో నివాసం ఉంటోంది. సింగ‌రేణి కార్మికుడు రామారావు కూతురు. వాస్త‌వానికి ఫిబ్ర‌వరి 27న బ‌య‌ల్దేరి, మార్చి 1న ఇండియాకు రావాల్సి ఉంది. ఇంతలో ఇలా జరిగింది. తాము సుర‌క్షితంగానే ఉన్నామ‌ని స్ఫూర్తి చెబుతోంది.


ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు


కీవ్ ఎయిర్ పోర్టులో ఆగిపోయిన 20 మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ముందస్తుగా అక్కడి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసింది. వాళ్లంతా ముందుగానే టికెట్ రెడీ చేసుకొని ఎయిర్‌పోర్టుకు వచ్చారు. 


కీవ్ ఎయిర్ పోర్టును అక్కడి ప్రభుత్వం మూసివేసింది. బయటకు వెళ్లే దారులన్నీ మూసివేసింది. దీంతో అటు స్వదేశం రాలేక, ఇటు యూనివర్శిటీకి వెళ్లలేక దాదాపు 20 మంది ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వీరిలో కరీంనగర్‌కు చెందిన మెడికల్ విద్యార్థి కడారి సుమాంజలి, రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత ఉన్నారు.


వీరంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే. వీరితోపాటు దాదాపు 20 మంది ఎయిర్ పోర్ట్ వద్ద చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని కడారి సుమాంజలి తన సోదరుడు కడారి స్వామికి ఫోన్ చేసి వివరించారు. తమను ఎటూ వెళ్లనీయడం లేదు. అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. 


బండి భరోసా


కడారి స్వామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి తమ సోదరితోపాటు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయి భారతీయులు పడుతున్న బాధలను వివరించారు. వెంటనే తమ వారిని స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. తక్షణమే స్పందించిన బండి సంజయ్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయానికి ఫోన్ చేశారు. చిక్కుక్కుపోయిన వారందరినీ స్వదేశానికి రప్పించాలని కోరుతూ లేఖ పంపారు.


కరీంనగర్ లోని కోతిరాంపూర్ కు చెందిన అనుమల్ల రోహిత్ క్యూ సిటీలో ఇరుక్కున్నాడు. క్యూ నేషనల్ మెడికల్ కాలేజీలో  ఐదేళ్లుగా మెడిసిన్ చదువుతున్నాడు. ఇండియా కు రప్పించే చర్యలు తీసుకోవాలని  కోరుతున్నాడు. షయం తెలిసుకున్న బండి సంజయ్ వీడియో కాల్ చేసి రోహిత్‌ తో మాట్లాడారు. 


జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన బద్దం నీహారిక రెడ్డి ఉక్రెయిన్‌లో చిక్కుకుంది.ఆ ఫ్యామిలీని కూడా బండి సంజయ్‌ పరామర్శించారు. విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. 


ప్రణయ్‌ తమ్ముడు కూడా


నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన యువకుడు అజయ్ వైద్య విద్య అభ్యసించడానికి రష్యా వెళ్ళాడు.. మరో మూడు నెలల్లో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ పూర్తిచేసుకుని తిరిగి స్వస్థలం రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకున్నాడు. దీంతో మిర్యాలగూడలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని వేలాదిగా ఉన్న విద్యార్థులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు యువకులు కూడా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లారు. గంజి భానుప్రసాద్, ముదంబై శేషఫణిచంద్ర ఇండియా రావడం కోసం కీవ్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చి చిక్కుకున్నారు. కాసేపటికి వాళ్ల గుర్తింపు కార్డులు చూపించి కాలేజీకి వెళ్లిపోయారు.