కరీంనగర్(Karimnagar) రాజకీయ మార్పులకు కీలకమైన ప్రాంతం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)కి ఊపిరిపోసిన కరీంనగర్ ఈ మధ్య బీజేపీ(BJP) కి ఫైర్ బ్రాండ్ గా మారింది. బండి సంజయ్ కి ఆదరణ పెరిగేలా  అవకాశం ఇచ్చింది. గతంలో విద్యాసాగర్ రావు లాంటి జాతీయ స్థాయి నేతను అందలం ఎక్కించిన కరీంనగర్ పార్లమెంట్ స్థానం.. దక్షిణాదిలో మరింత బలపడాలని అనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఉత్తర తెలంగాణలోని కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఉన్న విలువ బాగా తెలుసు. అందుకు వ్యూహాత్మకంగానే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్(Bandi Sanjay) కి ఉన్న ఫాలోయింగ్ ని సెంటిమెంట్ తో కలిపి పార్లమెంటు స్థానాన్ని చేజిక్కించుకుంది. అలా మొదలైన దూకుడు వరుసగా బండి సంజయ్ కి కీలకమైన పదవులు అప్పగించడంతో రాష్ట్రస్థాయిలో తనదైన శైలితో దూకుడుగా వెళ్లడం మొదలుపెట్టారు. అదే సమయంలో వచ్చిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో. దుందుడుకు విధానాలతో బండి సంజయ్ తనదైన మార్క్ ని చూపించారు. దీంతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నలభైకి పైగా కార్పొరేషన్ స్థానాలను బీజేపీ గెలిచింది. తరువాత వరుసగా అధికార టీఆర్ఎస్, ఆ పార్టీ అధినాయకత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు బండి సంజయ్. మరోవైపు గ్రౌండ్ లెవెల్ లో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ నిరసనలు ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ తనకు పునాది లాంటి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు మాత్రం మింగుడు పడడం లేదు బీజేపీ బాస్ కి. 


జిల్లా బీజేపీలో అసలేం జరుగుతోంది?


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు కీలకమైన సీనియర్ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పోల్సని సుగుణాకర్ రావు కొన్ని దశాబ్దాలుగా జిల్లా బీజేపీలో పదవులతో మొదలై రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. వీరిద్దరూ ఇతర నేతలైన వెంకటరమణి, రాములు ఇతర నేతలతో కలిసి మంగళశారం హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్(MLA Quaters) లో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసిన బండి సంజయ్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే రహస్య సమావేశం నిర్వహించడం జిల్లా బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా మారింది. దీంతో అప్రమత్తమైన బండి సంజయ్ కేంద్ర నాయకత్వానికి మొత్తం విషయాన్ని వివరించారు. మరోమారు ఇలా జరగదని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేయడంతో అంతా ముగిసింది అనుకున్నారు. మరోమారు ఈ నేతలు సమావేశమై తమకు పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత లభించడం లేదని నిరసన వ్యక్తం చేయడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని చర్చనీయాంశమైంది. ఇద్దరు సీనియర్ నేతలు ఇతరులతో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహించడం ఇక కఠినమైన చర్యలకు  కేంద్ర బీజేపీ నాయకత్వం సిద్ధం అవుతోందా లేదా అనేది వేచిచూడాలి. ఇదే విషయంపై జిల్లాకు చెందిన కీలక నాయకుణ్ణి ఏబీపీ దేశం సంప్రదించగా ఆ విషయం పై స్థాయి నేతలే చూసుకుంటారంటూ దాటవేశారు.