Crime News :  ఆన్ లైన్ మోసాల్లో నైజీరియన్లదే హవా. వారు చెప్పే మాటలకు బుట్టలో పడిపోయి .. సర్వం పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారిని మించిపోయారు చైనీయులు. లోన్ యాప్స్ పేరుతో వారు చూపించిన నరకానికి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు మరో రూపంలో మోసాలు ప్రారంభించారు. దానికి పెట్టుబడి అనే పేరు పెట్టారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అనే సరికి అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టే మధ్యతరగతి భారతీయుల ఆశలను ఆసరాగా చేసుకుని వందల కోట్లు బొక్కేశారు. ఆ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకునే వరకూ ఇలా కూడా మోసం చేస్తారని ఊహించలేని పరిస్థితి. 


హైదరాబాద్ పోలీసులు తమకు వచ్చిన ఓ సైబర్ నేరం కేసును సీరియస్‌గా తీసుకుని గట్టు రట్టు చేశారు.  ఢిల్లీ కేంద్రంగా సైబర్ క్రైమ్  హవాలా రాకెట్ ను అరెస్ట్ చేశారు.  లోక్సమ్ అనే చైనీస్  ఇన్వెస్ట్ మెంట్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోస పోయిన హైదరాబాద్ కి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కూపీ లాగిన పోలీసులకు సంచలన విషాయలు వెలుగు చూశారు. పెట్టుబడి పెట్టింది ఒక్కరు కాదని దేశ వ్యాప్తంగా అనేక మంది ఉన్నారని తేలింది. ఇలా పెట్టుబడుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును  ఇండియన్రూపీస్ ను డాలర్ రూపంలో మార్చి హవాలా చేస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా  రూ. 903 కోట్లు రూపాయలు మోసం చేసి ఇతర దేశాలకు తరలించారు. అయితే ఇది దర్యాప్తు చేసే కొద్దీ లోతు తెలుస్తుందని... ఇంకా పెద్ద మొత్తంలో ఉండవచ్చని  పోలీసులు చెబుతున్నారు. 


ఈ రకమైన హవాలా ముఠా ను సీసీఎస్ , సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకోవడం దేశంలోనే మొట్ట మొదటి సారి. ఈడీ, DRI కూడా ఇప్పటి వరకు ఇలాంటి మోసాలను గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు.    అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్కామ్ ఇది, దేశ భద్రతకు ముప్పు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 10 వేల నుండి 50 వేల కోట్లు వరకు ఈ స్కామ్ జరిగి ఉండొచ్చని..దీన్ని ఆపరేట్ చేస్తున్న ఇద్దరు చైనీయులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఇద్దరు హవాలా డీలర్లు  సాహిల్ , సన్నీ డిల్లో ఉండి వారి ద్వారా ఈ హవాలా నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. చు చున్ యూ , లెక్ అనే వ్యక్తి చైనా లో ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. 



సంజయ్ కుమార్ , నవదీప్  ఇద్దరు వ్యక్తలు  చైనా వెళ్లి రెండేళ్లు పాటు అక్కడ ఉండి చైనీస్ నేర్చుకున్నాడని పోలీసులు గుర్తించారు. సంజయ్ 15 అకౌంట్ లు ఓపెన్ చేసి కంబోడియా కంబోడియా లో హెడ్ క్వాటర్ పెట్టుకొని ఈ హవాలా దందా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ యాప్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లు గుర్తించామమని.. ఫేక్ అకౌంట్లు, వర్చువల్ అకౌంట్ లు ఓపెన్ చేసి మోసం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ స్కామ్‌పై ఈడీ, డీఆర్ఐతో కలిసి దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధం అవుతున్నారు.