Hyderabad News: 'ఎక్కడి నుంచి వస్తాయిరా ఇలాంటి ఐడియాలు..' అనేంతలా ఉంటున్నాయి కేటుగాళ్ల దొంగతనాల స్టైల్. ఈ మధ్యకాలంలో జరుగుతున్న దొంగతనాలు, మోసాలు చూస్తుంటే.. వీళ్లు మామూలోళ్లు కాదు అనిపిస్తోంది. తమ కళకు మరింత క్రియేటివిటీ జోడించి చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారు. మరీ ఇంత సింపులా అనిపించేలా మోసాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ దొంగతనం అచ్చంగా ఇదే కోవలోకి వస్తుంది. చాలా సింపుల్ గా కారు కొట్టేశాడు. పట్టపగలే కారు దొంగలించుకుని దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ పోయాడు. క్రైమ్ బ్రాంచ్ పోలీసు అని హైదరాబాద్ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గ మధ్యలో హోటల్ వద్ద ఆపి క్యాబ్ డ్రైవర్ ను బిర్యానీ తీసుకురమ్మని క్యాబ్ డ్రైవర్ తో చెప్పాడు. అతడు బిర్యానీ తీసుకుని తిరిగి వచ్చేలోపే కారుతో సహా ఉడాయించాడు.
సంగారెడ్డి జిల్లా గంగాపూర గ్రామానికి చెందిన నరేష్ తన కారును జహీరాబాద్ అడ్డాపై ఉంచి కిరాయికి నడుపుతున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి సంగారెడ్డికి వెళ్లాలన్నాడు. సంగారెడ్డిలోని ఉమెన్ పోలీస్ స్టేషన్ లో పని ఉందంటూ కారును కిరాయికి మాట్లాడుకున్నాడు. తాను మహారాష్ట్రకు చెందిన క్రైమ్ బ్రాంచి పోలీసుగా క్యాబ్ డ్రైవర్ తో పరిచయం చేసుకున్నాడు. చెప్పినట్లుగానే సంగారెడ్డి ఉమెన్ పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపాడు. అతగాడు కారు దిగి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి, కాసేపయ్యాక బయటకు వచ్చాడు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఆఫీసు బయట కాసేపు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడాడు. అతగాడు ఇచ్చిన కటింగ్ కు క్యాబ్ డ్రైవర్ అతడు నిజంగానే పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడని అనుకున్నాడు.
అక్కడి నుంచి హైదరాబాద్ వరకు వెళ్లాలని క్యాబ్ డ్రైవర్ కు చెప్పాడు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రూ.3 వేలు అవుతుందని క్యాబ్ డ్రైవర్ నరేష్ చెప్పగా.. దానికి సరేనని రూ. 3 వేలూ ఇస్తానని చెప్పాడు. తనకు ఆకలిగా ఉందని మంచి హోటల్ వద్ద ఆపాలన్నాడు. హైదరాబాద్ మార్గ మధ్యలో పటాన్ చెరు మండలం రుద్రారం శివారులో ఉన్న ప్యాలెస్ హోటల్ వద్ద కారు ఆపాడు డ్రైవర్. పోలీసు దర్పంతో బిర్యానీ తీసుకురావాలని క్యాబ్ డ్రైవర్ ను ఆదేశించాడు.
పోలీసు అధికారి అని నమ్మిన డ్రైవర్.. మారు మాట్లాడకుండా అతడు చెప్పినట్లుగా బిర్యానీ కోసం హోటల్ కు వెళ్లాడు. డ్రైవర్ నరేష్ ఒక బిర్యానీ తీసుకువచ్చాడు. మరో 3 బిర్యానీలు తీసుకురావాలని వెయ్యి రూపాయలు ఇచ్చి మరోసారి పంపించాడు. డ్రైవర్ నరేష్ బిర్యానీ తెచ్చే లోపే కారు లేదు, కారులో మనిషీ లేడు. దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ తమ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో కారు ఎక్కడైనా ఉంటే చెప్పండి అంటూ మెసేజ్ షేర్ చేశాడు. అనంతరం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జహీరాబాద్ లో స్టే చేసిన హోటల్ గది కోసం ఇచ్చిన ఆధార్ కార్డు వివరాల్లో నిందితుడి పేరు అభినాష్ ప్రకాష్ షిండే అని ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
Read Also: Monsoon Break: తెలంగాణలో కానరాని వాన జాడ, వేసవిని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు