Monsoon Break: తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు జోరు వర్షాలు ఇబ్బందిపెట్టగా.. ఇప్పుడు జోరు ఎండలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత పెరగడంతో వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదు అవుతాయని, ఉక్కపోత తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆగస్టు 20వ తేదీ వరకు వర్షాలకు అవకాశం లేదని తెలిపారు. సాధారణంగా ఆగస్టులోనూ వానలు పడతాయి. ఎండలు తక్కువగా నమోదు అవుతుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఆగస్టు నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.


రుతుపవనాల విరామం సాధారణంగా ఒక వారం నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. ఈసారి అది ఆగస్టు 1 నుంచి ప్రారంభమై ఆగస్టు 14వ తేదీ వరకు కొనసాగుతుంది. గత వారంలో హైదరాబాద్ లో వారం మొత్తం సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆగస్టు 10 నుంచి 11 తేదీల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 32.8 డిగ్రీ సెల్సియస్ గా నమోదు అయ్యాయి. రోజులో ఉష్ణోగ్రత వ్యత్యాస్యం 2.5 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. 


ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద రుతుపవనాల విరామ కాలంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మాన్‌సూన్ బ్రేక్ మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. ఆగస్టు 20 వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఎక్కువ స్థాయిలో ఏమీ ఉండవని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్లే రాష్ట్రంలో ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 2021 లో తెలంగాణ రాష్ట్రంలో 23 రోజుల పాటు రుతుపవనాల విరామం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నల్గొండలో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. 


తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం, గత నెలలో వర్షపాతం 114 శాతం అధికంగా నమోదు అయింది. ఆగస్టు నెలకు వచ్చే సరికి అది కాస్త 81 శాతం లోటుకు పడిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం ఆగస్టు 20వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది.


రాజస్థాన్ లో ఆగస్టు 15 తర్వాత వర్షాకాలం


ఆగస్టు 15 తర్వాత రాజస్థాన్‌లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజులుగా వర్షాకాలానికి బ్రేక్ పడింది. ఆగస్టు 14 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 15 తర్వాతే రాష్ట్రంలో కుండపోత వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.



ఈ రాష్ట్రాల్లో వర్షాలు
గుజరాత్, మహారాష్ట్రలోని విదర్భ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.