Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారయత్నం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసేందుకు ఇద్దరు యువకులు ప్రయత్నించారు. మియాపూర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అయిన యువతి రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తుండగా.. అదే కంపెనీకి చెందిన ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు అత్యాచారం చేయబోయారు.


బాధిత యువతి ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె ఉప్పల్‌లో నివాసం ఉంటూ మియాపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తోంది. సేల్స్ ట్రైనీగా ఆ కంపెనీలో యువతి పని చేస్తోంది. అయితే, అదే సంస్థలో సేల్స్ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు యువకులు సంగారెడ్డి, జనార్దన్‌లు యువతికి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లినట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారని.. సైట్‌కు వెళ్లిన తనపై ఇద్దరూ కలిసి అత్యాచారానికి యత్నించారని ఆమె వాపోయారు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకొని తాను పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించింది. జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేయగా.. ఉప్పల్ పోలీసులు ఆ కేసును మియాపూర్‌ స్టేషన్ పరిధిలోకి బదిలీ చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. నిందితులు ఇద్దర్నీ అరెస్టు చేశారు. యువతికి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు.