Hyderabad Crime News: మహిళలకు ఇంటా బయట రక్షణ లేకుండా పోతోంది. బాలికలు, యువతులు, వివాహితలైనా కొన్ని సందర్భాలలో సురక్షితంగా ఉండలేకపోతున్నారు. పని చేసే చోట, బస్సుల్లో ప్రయాణిస్తుంటే, రోడ్డుపై నడుస్తుంటే, ఇంట్లో ఉన్న పురుషులతోనూ వారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి బాత్రూములో కూడా వారికి ప్రైవసీ లేకుండా పోతోంది. షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డు చేస్తున్న సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఇంట్లోని బాత్రూములో స్నానం చేస్తుంటే కూడా వీడియో తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 


తల్లిగారింటికి వచ్చిన మహిళ వీడియాలు తీసిన యువకుడు


జనగాంలోని అత్తగారింట్లో ఉండే ఓ మహిళ తాజాగా హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని చిన్న గురుద్వారా వద్ద ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. వారి ఇంటి పక్కనే శ్రీదేవి బాయ్స్ హాస్టల్ ఉంది. అందులో ఉండే కిరణ్ అనే యువకుడి కన్ను ఈ ఇంట్లో ఉన్న మహిళపై పడింది. ఈ క్రమంలోనే ఆ ఇంటి బాత్రూమ్ వద్దకు చేరుకున్న యువకుడు కిరణ్.. మహిళ స్నానం చేస్తుండగా వీడియా తీశాడు. ఇలా ఎన్ని సార్లు తీశాడో తెలియదు కానీ ఈసారి అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చిన మహిళ వీడియో తీశాడు. శ్రీదేవి బాయ్స్ హాస్టల్ టెర్రస్ పైకి ఎక్కి బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ వద్ద సెల్ పెట్టి వీడియో రికార్డ్ చేశాడు. అక్కడ ఎవరో తచ్చాడుతున్నట్లు అలికిడి వినిపించడంతో గమనించిన మహిళ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. 


వెంబడించి పట్టుకుని చితకబాదిన స్థానికులు


దీంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల ఇళ్ల వారు గుమిగూడారు. ఏమైందని ఆరా తీయగా ఎవరో ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుండి తాను స్నానం చేస్తుంటే వీడియో తీస్తున్నారని మహిళ చెప్పింది. అదే సమయంలో ఆ హాస్టల్ టెర్రస్ నుంచి కిందకు దిగిన కిరణ్.. పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ యువకుడిపై అనుమానం రావడంతో స్థానికులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. కిరణ్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుని అందులో కెమెరా రికార్డింగ్స్, ఇతర ఫైల్స్ చెక్ చేశారు. అందులో మహిళకు సంబంధించిన వీడియో ఉండటంతో కిరణ్ ను స్థానికులు చితకబాదారు. 


యువకుడు కిరణ్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు 


అనంతరం పోలీసులకు సమాచారం అందించి కిరణ్ వారికి అప్పగించారు. మహిళ ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిరణ్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కిరణ్ పై లైంగిక వేధింపులు సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్ నగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపారు. ఇలాంటి మళ్లీ జరగకుండా అన్ని హాస్టల్స్ యజమానులకు తగు సూచనలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంటి పక్కన ఇలాంటి వ్యక్తుల పట్ల ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.