Honey Trap: సోషల్ మీడియా వేదికలుగా పరిచయం పెంచుకుంటుంది. ఆపై ఛాటింగ్ చేసి.. త్వరలోనే ఆ స్నేహాన్ని ఫోన్ కాల్స్ లోకి మార్చేస్తుంది. తియ్యగా మాట్లాడుతూ... కోటీశ్వరులు అయ్యే ప్లాన్ చెప్తానంటుంది. ఆమె ప్లాన్ విని ఓకే చెప్పారంటే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్లే. ఎందుకుంటే ముందుగా లాభాలు చూపించి ఆపై కుచ్చుటోపీ పెడుతుంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఇలాగే మోసం చేసిందీ కిలాడీ లేడీ. ఒకరి వద్ద నుంచి 56 లక్షలు, మరో వ్యక్తి నుంచి 51 లక్షలు కాజేసి వారిని బ్లాక్ లో పెట్టేసింది. మోసపోయినట్లు గుర్తించిన సదరు వ్యక్తులు వేర్వేరుగా సోమవారం రోజు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..?


బంజారాహిల్స్‌కు చెందిన ఓ 58 ఏళ్ల వ్యక్తికి ఇటీవల టెలిగ్రామ్ వేదికంగా ఓ అమ్మాయి పరిచయం అయింది. రెండు రోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఆపై యవ్వారం కాల్స్ లోకి చేరింది. ఇలా తియ్యటి మాటలు చెబుతూ సదరు యువతి తాను ఇన్వెస్టర్ ని అంటూ నమ్మబలికింది. నాలా నువ్వు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటూ కోరింది. ఆమె మాటలకు బుట్టలో పడిపోయిన వ్యక్తి ఆమె చెప్పినట్లుగానే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. తొలుత రెండు, మూడు పర్యాయాలు లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత సుమారు రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయించి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే మరింత కట్టాలని వివరించింది. అది నమ్మిన వ్యక్తి.. పలు దఫాలుగా మొత్తం రూ.52 లక్షలను అమెకు పంపాడు. ఆ తర్వాత నుంచి సదరు యువతి పోన్ స్విచ్ఛాఫ్ చేసింది. టెలిగ్రామ్ లోనూ అతడిని బ్లాక్ లో పెట్టింది. 


ఇదే మాదిరిగా మెహదీపట్నంకు చెందిన యువకుడి నుంచి కూడా


అలాగే మెహదీపట్నంకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడికి ఇదే మాదిరిగా ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇన్వెస్ట్ మెంట్ నుంచి క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేయించింది. పలు దపాలుగా యువకుడి నుంచి రూ.56 లక్షలు స్వాహా చేసింది. ఈ ఇద్దరిదీ ఒకే రకమైన వలపు వల కావడంతో పోలీసులు కూడా షాకయ్యారు. ముక్కు, మొహం తెలియని వాళ్లు తియ్యగా మాట్లాడితే వారితో మాట కలపకూడదని.. ఒకవేళ కలిపినా అలాంటి వారికి డబ్బులు పంపకూడదని సూచిస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


హనీట్రాప్‌ అంటే ఏమిటి ? 


ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా సెక్సువల్ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్‌ అనే పేరును వింటూనే ఉన్నాం. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం.. ఆ తరువాత వారితో వీడియో కాల్ చేయడం, ఆపై వాళ్ల న్యూడ్‌ వీడియోస్‌ రికార్డ్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయడం అనేది కామన్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇదే రకమైన ఘటనలు వెలగులోకి వస్తున్నాయి. మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి హనీట్రాప్‌ నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఈ రకమైన మోసాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. అప్రమత్తంగా లేకుంటే డబ్బులు పోవడంతో పాటు, పరువు, ప్రతిష్టలకు భంగం కలగక తప్పదు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే లక్ష్యంగా మహిళల పేరుతో ఈ నేరాలకు దిగుతున్నారు.